హోమ్ షిలాజిత్ క్యాన్సర్ నయం చేస్తుందంటానికి ఎటువంటి ఆధారం లేదు

షిలాజిత్ క్యాన్సర్ నయం చేస్తుందంటానికి ఎటువంటి ఆధారం లేదు

ద్వారా: క్రిస్టియన్ హాగ్

ఆగస్టు 30 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
షిలాజిత్ క్యాన్సర్ నయం చేస్తుందంటానికి ఎటువంటి ఆధారం లేదు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

షిలాజిత్ క్యాన్సర్ నయం చేస్తుందనటానికి ఎటువంటి ఆధారం లేదు. ఇతర క్యాన్సర్ మందులతో కలిపి వాడినప్పుడు ఎలుకలలో పరిమిత ప్రభావం మాత్రం కనిపించింది.

నేపధ్యం

హిమాలయ ప్రాంతంలో పండే  షిలాజిత్ “పండు” నుండి తీసే “పచ్చి నూనె” క్యాన్సర్ కణాలని 42 గంటలలో నిర్మూలిస్తుందని, అయితే “వాళ్ళు” దాని కారణంగా లక్షల కోట్లు నష్టపోతున్న కారణంగా ఈ నూనెని నిషేధించటానికి “వాళ్ళు”  ప్రయత్నిస్తున్నారని టిక్ టాక్ లో ఒక ప్రచారం నడుస్తున్నది. అటువంటి ఒక టిక్ టాక్ వీడియోకి మార్చ్ 2023 నుండి 44 లక్షల వ్యూస్ ఉన్నాయి. ఇక్కడ “వాళ్ళు” అంటే ఎవరో స్పష్టత లేదు. అయితే ఈ వార్త అబద్ధం. 

వాస్తవం

షిలాజిత్ క్యాన్సర్ నయం చేయగలదు అనేదానికి ఏ ఆధారం లేదు. ఇతర క్యాన్సర్ మందులతో కలిపి వాడినప్పుడు మాత్రం క్యాన్సర్ వైద్యంలో దీనికి పరిమితి ఉపయోగం ఉంది అని మాత్రం కొన్ని పరిమిత సంఖ్య పరిశోధనలలో తేలింది. అయితే ఇప్పటివరకు ఈ పరిశోధనలు ఎలుకల  మీద మాత్రమే నిర్వహించారు. మనుషుల మీద ఇంకా నిర్వహించలేదు. ఫ్యాక్ట్ చెకింగ్ చేసే ఇంకొక వెబ్సైట్ ‘లీడ్ స్టోరీస్’ కూడా ఈ ప్రచారం గురించి నిర్ధారించింది. క్యాన్సర్ నయం చేస్తుంది అనటానికి ఎటువంటి ఆధారం లేదు అని లీడ్ స్టోరీస్ కూడా నిర్ధారించింది. 

అలాగే షిలాజిత్ అనేది పండు కాదు. దీని గురించి చెబుతున్న వీడియోలో చూపించిన బొమ్మ సీతాఫలానిది. షిలాజిత్ అనేది హిమాలయాలలోని, టిబెటియన్ పర్వతాలలోని, అల్టాయి పర్వతాలలోని  శిలల మధ్య పొరలలో లభించే నల్లని/మట్టి రంగులో ఉండే ఖనిజ రెజిన్ (అంటే బంక లాగా ఉండే ఖనిజం). ఆయుర్వేద వైద్యంలో దీనికి ఎంతో ముఖ్య పాత్ర ఉంది. 

ఆయుర్వేద అనేది ప్రాచీన భారత వైద్య విధానం. సహజ, పూర్ణరూపాత్మక విధానాంలో సరైన తిండి, వ్యాయామం, జీవన శైలి  ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం నిలబెట్టుకునే ఒక ప్రక్రియ. ఈ వైద్యం నేటికి కూడా భారతదేశ వైద్య వ్యవస్థలో ఒక ముఖ్య భాగం. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రక్రియని అక్షరీకరించారు. అవే నేటికీ దిక్సూచి. ఆయుర్వేద వైద్యం ప్రభావవంతమైనది అని కొన్ని పరిశోధనలలో తేలింది. జాన్ హోప్కిన్స్ విశ్వవిద్యాలయం,, అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వారి పరిశోధన ప్రకారం అల్లోపతీ వైద్యానికి తోడుగా తీసుకుంటే ఆయుర్వేద వైద్యం మంచిగా పనిచేస్తుంది అని తేలింది. అయితే ఇటువంటి పరిశోధన చాలా పరిమితంగా జరిగింది. ఆలాగే ఆయుర్వేద వైద్యానికి శాస్త్రీయ సమాజంలో పెద్ద మద్ధతు లేదు. 

“వాళ్ళు” అని అన్నది చాలా వరకు ఫార్మా పరిశ్రమని ఉద్దేశించి. కుట్ర సిద్ధాంతాలు ప్రచారం చేసే సమూహంలో ఫార్మా పరిశ్రమని “బిగ్ ఫార్మా” అని పిలుస్తుంటారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ “బిగ్ ఫార్మా”  మళ్ళీ ఈ కుట్ర సమూహం ప్రచారంలో ప్రముఖంగా వచ్చింది. ఈ సమూహం దృష్టిలో ఫార్మా పరిశ్రమ మహమ్మారి సమయంలో టీకాలు, ఇతర మందుల ద్వారా కోట్లు కూడబెట్టుకున్న ఒక దుర్మార్గపు వ్యవస్థ. అలాగే సమాజం మంచి కోసం కాకుండా ఈ బిగ్ ఫార్మా అనేది తమ తమ మందులు మరింతగా అమ్మటానికి  ప్రజల జీవితాలని ఉద్దేశపూర్వకంగా విషతుల్యం చేస్తుంది అని కూడా ఈ సమూహం నమ్మకం. అలాంటి వీళ్ళ నమ్మకాలలో ఇంకొక నమ్మకం ఏమిటంటే క్యాన్సర్ నివారణకి వైద్యం ఉంది, అయితే తాము చేసే క్యాన్సర్ వైద్యం కారణంగా వస్తున్న లాభాలు దెబ్బతినకుండా ఉండటానికి ఈ బిగ్ ఫార్మా ఆ నివారణ వైద్యాన్ని కప్పిపెట్టి ఉంచింది అని. 

పెద్ద పెద్ద ఫార్మా సంస్థల పట్ల విమర్శ సహజమే. అయితే ఈ సంస్థలు కావాలని ప్రజల జీవితలని విషతుల్యం చేస్తున్నాయని, “సహజ నివారణ” వైద్యాన్ని కావాలని తొక్కిపెడుతున్నాయని చెప్పడం మాత్రం కుట్ర సిద్ధాంతమే. వాటికి ఎటువంటి ఆధారం కూడా లేదు. 

తీర్పు

షిలాజిత్ అనే పండే లేదు. ఆలాగే షిలాజిత్ అనేది క్యాన్సర్ నయం చేస్తుంది అనేదానికి ఆధారం లేదు. కాబట్టి ఈ వార్త అబద్ధం అని మేము నిర్ధారించాము. 

అనువాదం- గుత్తా రోహిత్

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.