ద్వారా: రోహిత్ గుత్తా
డిసెంబర్ 22 2023
కొత్తగా ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వం అలాంటి ఉత్తర్వులు ఏమి ఇవ్వలేదు. విద్యా శాఖలోని అధికారులు కుడా అటువంటిది ఏమి లేదని తెలిపారు.
క్లెయిమ్ ఏమిటి?
తెలంగాణ లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తమ పిల్లల్ని ప్రభత్వ విద్యా సంస్థలలోనే చదివించాలని ఉత్తర్వులు జారీ చేసిందని క్లెయిమ్ చేస్తూ ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) మరియు ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలలో పలు పోస్ట్లు వైరల్ అవుతున్నాయి. అలాంటి పోస్టులో, ఈ ఉత్తర్వులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జారీ చేశారని, ఒకవేళ ఈ నిభందనలు ఉల్లంఘిస్తే, ఆ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, మరియు ఏ ఇతర సదుపాయాలు కుడా వర్తించావు అని రాసి ఉంది. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కానీ, ఇది నిజం కాదు. ముఖ్య మంత్రి కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు.
మేము ఏమి కనుగొన్నము?
ఈ విషయం గురించి నమ్మదగిన వార్త కథనాలు ఏమైనా ఉన్నాయా అని మేము వెతికి చూశాము. కానీ అలాంటిది ఏమి మాకు కనిపించలేదు. డిసెంబర్ 7 నుండి- అంటే రేవంత్ రెడ్డి మరియు ఇతర శాసనసభ్యలు పదవి స్వీకారం చేసిన తరువాత నుండి- ఏవైనా ఉత్తర్వులు జారీ చేశారా అని తెలంగాణ ప్రభుత్వ అధికార వెబ్సైట్ కుడా వెతికి చూశాము. కానీ అలాంటి ఉత్తర్వులు ఏమి కనిపించలేదు.
ముఖ్య మంత్రి కార్యాలయం వారు అధికారిక ప్రకటనల వెబ్సైటు కూడా చూశాము. దానిలో కుడా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తమ పిల్లలని ప్రభత్వ విద్యా సంస్థలకు పంపాలనే ఉత్తర్వులు ఏమి కనపడలేదు.
లాజికల్లీ ఫ్యాక్ట్స్ తెలంగాణ విద్యా శాఖ వారిని సంప్రదించగా, పేరు తెలుపడానికి ఇష్టపడని ఒక ఉన్నత అధికారి, ఈ వైరల్ పోస్ట్ లో ఉన్నట్టుగా ఏలాంటి ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేయలేదు అని తెలిపారు.
లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఈనాడు సీనియర్ పాత్రికేయులు బాపనయ్యని కుడా సంప్రదించింది, ఈయన విద్యా శాఖ రిపోర్టర్ కూడా. ఈయన మాతో మాట్లాడుతూ, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇంకా విద్యా శాఖ మంత్రిని నియమించలేదు కాబట్టి ఇలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోడానికి ఆస్కారం లేదు అన్నారు. ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతానికి 12 మంత్రులని వివిధ శాఖలకు నియమించింది. విద్యా శాఖ మరియు ఇతర కొన్ని శాఖలతో సహా ఇంకా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి.
తీర్పు :
తెలంగాణ ముఖ్య మంత్రి ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ విద్యా సంస్థలలోనే చదివించాలి అని నిబంధన పెట్టారు అనే క్లైమ్ ఎలాంటి నిజం లేదు. అలాంటి అధికార ప్రకటన తెలంగాణ ప్రభుత్వం చేయలేదు. కావున, మేము ఇది అబద్ధం అని నిర్ధారించాము.
(అనువాదం: రాజేశ్వరి పరస)