హోమ్ చైనాకి చెందిన ఫొటోలని అమెరికాలోని బి. ఆర్. అంబేద్కర్ గ్రంధాలయం ఫొటోలుగా క్లైమ్ చేశారు

చైనాకి చెందిన ఫొటోలని అమెరికాలోని బి. ఆర్. అంబేద్కర్ గ్రంధాలయం ఫొటోలుగా క్లైమ్ చేశారు

ద్వారా: అనెట్ ప్రీతి ఫుర్తాధో

డిసెంబర్ 22 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
చైనాకి చెందిన ఫొటోలని అమెరికాలోని బి. ఆర్. అంబేద్కర్ గ్రంధాలయం ఫొటోలుగా క్లైమ్ చేశారు అమెరికాలో బి. ఆర్. అంబేద్కర్ గ్రంధాలయం ఫొటోలు అంటూ క్లైమ్ చేసిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఇవి చైనాలోని టియాన్జిన్ బిన్హాయ్ గ్రంధాలయం ఫొటోలు. అమెరికాలో బి. ఆర్. అంబేద్కర్ పేరిట పేరుపొందిన గ్రంధాలయం ఏదీ లేదు కూడా.

క్లైమ్ ఏంటి?

సామాజిక మాధ్యమాలలో ఒక పెద్ద గ్రంధాలయానికి చెందిన నాలుగు ఫొటోలు షేర్ చేసి ఇవి అమెరికాలో బి. ఆర్. అంబేద్కర్ కి అంకితం చేసిన గ్రంధాలయం ఫొటోలు అని క్లైమ్ చేశారు. బి. ఆర్ అంబేద్కర్ స్వతంత్ర భారత మొదటి న్యాయ శాఖ మంత్రి, సంఘ సంస్కర్త, భారత రాజ్యాంగ ముఖ్య నిర్మాత. ఈ నాలుగు ఫొటోలలో ఒక దాంట్లో భవంతి మధ్యలో ఒక పెద్ద తెల్లని గోళాన్ని మనం చూడవచ్చు. అలాగే తెల్లని గోడని అనుకుని పైకప్పు నుండి నేల వరకు పుస్తక అరలని కూడా మనం చూడవచ్చు.

ఫేస్బుక్ లో ఒక యూజర్ ఈ ఫొటోలని షేర్ చేసి, “భారత దేశ రక్షకుడు బి. ఆర్. అంబేద్కర్ పేరు మీద అమెరికాలో ప్రపంచంలోనే అతి పెద్ద గ్రంధాలయాన్ని ప్రారంభించారు. జై భీమ్, జై ఇండియా, జై రాజ్యాంగం,” అనే శీర్షిక హిందీలో పెట్టారు. ఈ పోస్ట్, ఇటువంటి ఇతర పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ  మరియు ఇక్కడ  చూడవచ్చు. 

వైరల్ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ ఫొటోలు అమెరికాలో బి. ఆర్. అంబేద్కర్ గ్రంధాలయంగా చెప్పబడుతున్న గ్రంధాలయం ఫొటోలు కావు. ఇవి చైనాలోని టియాన్జిన్ బిన్హాయ్ గ్రంధాలయానివి.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ ఫొటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే ఈ ఫొటోలు ఆర్కిటెక్చరల్ విషయాలు ప్రచురించే ‘ఆర్క్ డైలీ’ అనే పత్రికలో ప్రచురితం అయ్యాయని తెలుసుకున్నాము. ఈ పత్రికలో కథనం ప్రకారం ఈ ఫొటోలు చైనాలో బీజింగ్ కి దగ్గరలో తీర ప్రాంతంలో ఉన్న టియాన్జిన్ అనే మెట్రో ప్రాంతంలో ఉన్న బిన్హాయ్ అనే జిల్లాకి చెందిన టియాన్జిన్ బిన్హాయ్ గ్రంధాలయానికి చెందిన ఫొటోలు. ఇదే కథనం ప్రకారం ఈ గ్రంధాలయాన్ని ఏం వి ఆర్ డి వి అనే డచ్ ఆర్కిటెక్చరల్ సంస్థ మరియు స్థానిక టియాన్జిన్ అర్బన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నిర్మించాయి.

వైరల్ ఫొటోలలో ఉన్న రెండిటిని మనం ఏం వి ఆర్ డి వి వారి అధికారిక వెబ్సైట్ లో చూడవచ్చు. అందులో ఒకటి పైన పేర్కొన్న తెల్లని గోళం ఫొటో, ఇంకొకటి పుస్తక అరల ముందు నుంచుని ఉన్న ఇద్దరు మహిళల ఫొటో.  ఈ వెబ్సైట్ ప్రకారం టియాన్జిన్ బిన్హాయ్ గ్రంధాలయం విస్తీర్ణం 33, 700 చదరపు మీటర్లు. అలాగే దీంట్లో  ప్రకాశవంతమైన గోళాకారపు ఆడిటోరియం, పైకప్పు నుండి నేల వరకు ఒంపులు తిరిగున్న పుస్తక అరలు ఉన్నాయి. ఈ గ్రంధాలయం నిర్మాణం 2017లో పూర్తయ్యిందని ఈ వెబ్సైట్ లో పేర్కొన్నారు.

నవంబర్ 2017 లో సిఎన్ఎన్ కూడా ఈ టియాన్జిన్ బిన్హాయ్ ప్రజా గ్రంధాలయం గురించి ఒక కథనాన్ని ప్రచురించింది. పైన పేర్కొన్న రెండు ఫొటోలని ఈ కథనంలో కూడా జత చేశారు.

నవంబర్ 29, 2017 నాడు టైమ్ మ్యాగజీన్ ఒక వీడియో విడుదల చేసింది. “చైనా భావికాల మరియు వివాదాస్పద 12 లక్షల పుస్తకాల గ్రంధాలయాన్ని ఇక్కడ చూడండిIటైమ్,” అనేది ఈ వీడియో శీర్షిక.  ఈ వీడియోలో టియాన్జిన్ బిన్హాయ్ గ్రంధాలయం ఫొటోలు చూపించారు. ఈ గ్రంధాలయాన్ని అధికారికంగా అక్టోబర్ 1, 2017 నాడు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో ఉన్న విజువల్స్ వైరల్  ఫొటోలని మ్యాచ్ అయ్యాయి. టైమ్ వీడియో కథనం ప్రకారం కొన్ని అరలలో పుస్తకాలని పోలి ఉండే ప్రింట్ చేసిన అల్యూమినియం రేకులని పెట్టారు. ఇది విమర్శలకు దారి తీసింది అని ఈ కథనంలో పేర్కొన్నారు. 

బి. ఆర్. అంబేద్కర్ కి అంకితం చేసిన గ్రంధాలయం అమెరికాలో ఉందా?

అమెరికాలో బి. ఆర్. అంబేద్కర్ పేరిట పేరుపొందిన గ్రంధాలయం ఉన్నట్టు లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి ఏ ఆధారాలు లభించలేదు.

అయితే అక్టోబర్ 2023లో భారత దేశం బయట అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని మేరీల్యాండ్ లో ఆవిష్కరించారు. ఈ విగ్రహం అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్ర ప్రాంగణంలో ఉంది. ఇది వైట్ హౌస్ కి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకోకీక్ అనే టౌన్ షిప్ లో ఉంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ‘ది లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్’ ప్రపంచంలో అతి పెద్ద గ్రంధాలయంగా గుర్తింపబడింది. గిన్నీస్ ప్రపంచ రికార్డ్స్ వారి సమాచారం మేరకు నవంబర్ 2021 నాటికి ‘ది లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్’ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంధాలయంగా గుర్తింపబడింది. ఇందులో 17, 37, 31, 463 వస్తువులు ఉన్నాయి. 

తీర్పు

అమెరికాలో బి. ఆర్. అంబేద్కర్ గ్రంధాలయం ఫొటోలు అంటూ షేర్ చేసిన ఫొటోలు వాస్తవంగా చైనా లోని ఒక గ్రంధాలయంకి చెందినవి. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.