హోమ్ రోహిత్ శర్మ పాత వీడియోని బంగ్లాదేశ్ క్రికెటర్ అల్ హసన్ కి జవాబు ఇస్తున్న వీడియోగా క్లైమ్ చేశారు

రోహిత్ శర్మ పాత వీడియోని బంగ్లాదేశ్ క్రికెటర్ అల్ హసన్ కి జవాబు ఇస్తున్న వీడియోగా క్లైమ్ చేశారు

ద్వారా: రాహుల్ అధికారి

అక్టోబర్ 10 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
రోహిత్ శర్మ పాత వీడియోని బంగ్లాదేశ్ క్రికెటర్ అల్ హసన్ కి జవాబు ఇస్తున్న వీడియోగా క్లైమ్ చేశారు ఫేస్బుక్ లో వైరల్ అయిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజియకల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

అబద్ధం

రోహిత్ శర్మ ఆగస్ట్ లో నిర్వహించిన పత్రికా సమావేశం వీడియోని బంగ్లాదేశ్ క్రికెటర్లు తమీమ్ ఇక్బాల్, షకీబ్ అల్ హసన్ మధ్య వివాదానికి లంకె పెట్టారు.

పురుషుల క్రికెట్ ప్రపంచ కప్పు అక్టోబర్ 5 నాడు మొదలయ్యింది. నెలన్నర్ర పాటు జరిగే ఈ టోర్నమెంట్ నవంబర్ 9 నాడు ముగుస్తుంది. ఈ కప్పులో పాల్గొనే జట్టులన్నీ కూడా ఆతిధ్య దేశమైన ఇండియాకి చేరుకున్నాయి. 

ఇవి జరుగుతుండగా బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ని ఈ టోర్నమెంట్ కి జట్టు నుండి సెప్టెంబర్ 26 నాడు తొలగించారు. ఈ నిర్ణయం వివాదానికి దారితీసింది. బంగ్లాదేశ్ మీడియా కథనాలు ప్రకారం జట్టులో అంతర్గత విబేధాలు ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ నిర్ణయానికి జవాబుగా ఇక్బాల్ సామాజిక మాధ్యమలలో తన అసంతృప్తిని వెలిబుచ్చారు. బ్యాటింగ్ ఆర్డర్ లో కింద భాగాన ఆడడానికి తాను నిరాకరించడం తమ జాతీయ క్రికెట్ బోర్డుతో తన సంబంధాలు దెబ్బతినటానికి కారణమని ఆయన తెలిపారు. 

దీనికి జవాబుగా బంగాలదేశ్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ భారతదేశ కెప్టన్ రోహిత్ శర్మ ఉదాహరణ తీసుకుని ఇక్బాల్ ని తప్పుబట్టారు. బంగ్లాదేశ్ కి చెందిన మీడియా సంస్థ టి స్పోర్ట్స్ తో సెప్టెంబర్ 27 నాడు మాట్లాడుతూ, “రోహిత్ శర్మ ని చూడండి. బ్యాటింగ్ ఆర్డర్ లో 7వ స్థానం నుండి ఓపెనర్ గా తన ప్రస్థానాన్ని మెరుగుపరుచుకుంటూ వచ్చారు. 10000కి పైగా పరుగులు స్కోర్ చేశారు. ఆయన ప్పుడప్పుడు 3 లేదా 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తే ఆదేమన్నా పెద్ద సమస్య అవుతుందా? ఈ వివాదం హాస్యాస్పదం. ఇది నా బ్యాట్, నేను ఆడతాను”, అని హసన్ తెలిపారు. 

క్లైమ్ ఏంటి?

షకీబ్ అల్ హసన్ వ్యాఖ్యలకి రోహిత్ శర్మ జవాబు చెప్పారు అంటూ ఆయన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో సర్కులేట్ అయ్యింది. అటువంటి ఒక పోస్ట్ శీర్షిక ఇలా ఉంది- తమీమ్ మీద షకీబ్ చేసిన వ్యాఖ్యలకి రోహిత్ శర్మ జవాబిచ్చారు (బెంగాలీ నుండి అనువాదం). ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రచురించే సమయానికి ఈ పోస్ట్ కి 13000 వ్యూస్, 929 లైక్స్ ఉన్నాయి. ఈ క్లైమ్ కి సంబంధించిన పోస్ట్స్ ఆర్కైవ్ వర్షన్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

ఈ వైరల్ వీడియో రోహిత్ శర్మ హిందీ లో ఈ మాటలు అనడం వినవచ్చు. “ఇది అర్థం చేసుకోవటం ముఖ్యం కాబట్టి నేను వివరంగా చెబుతాను. ఫ్లెక్సిబిలిటీ అవసరం అంటే దానర్థం ఓపెనర్ బ్యాట్స్ మ్యాన్ ని అదేదో స్థానంలో పంపటమో లేదా హార్దిక్ పాండ్యా ని ఓపెనర్ గా పంపాటమో కాదు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ గత 7-8 సంవత్సరాలుగా మాత్రమే ఓపెనర్స్ గా ఉన్నారు. విరాట్ కోహ్లి ఎప్పుడూ కూడా 3 వ స్థానంలోనే ఆడారు. 4 లేదా 5 వ స్థానంలో ఆడే కొత్త కుర్రాళ్ళు పై స్థానంలో ఆడటానికైనా లేదా కింద స్థానంలో ఆడటానికైనా సిద్ధంగా ఉండాలి. మేము ఆడటం మొదలుపెట్టిన కొత్తలో మా స్థానాలు కూడా మారుతా ఉండేవి. అంటే దానర్థం 8 వ స్థానంలో ఆడేవారిని ఓపెనర్ గా లేదా ఓపెనర్ గా ఆడేవారిని 8 వ స్థానానికి పంపుతామని కాదు. ఇటువంటి పిచ్చి పనులు మేము చెయ్యము.”

ఫేస్బుక్ లో వైరల్ అయిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజియకల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)    

మేము ఏమి కనుగొన్నాము?

ఈ వీడియోలో కేఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే ఇది పాత వీడియో అని, దీనికి ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెటర్ల నడుమ నడుస్తున్న వివాదానికి సంబంధం లేదని అర్థమయ్యింది. 

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) వారు ఆగస్ట్ 23, 2023 నాడు నిర్వహించిన పత్రికా సమావేశం వీడియో ఇది. ఈ కాన్ఫరెన్స్ వీడియో 32:20 నిమిషాలు పాటు ఉంది. ఈ వీడియోని ది క్వింట్ వారు తమ వెబ్సైట్ లో పెట్టారు. ఈ పత్రికా సమావేశంలో జట్టు సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టన్ రోహిత్ శర్మ ప్రపంచ కప్పు జట్టుని ప్రకటించారు. ఈ ప్రకటన తరువాత ఈ ఇద్దరూ క్రీడాకారుల గాయాలు, జట్టులో వారి స్థానాల గురించైనా ప్రశ్నలకి జవాబిచ్చారు. ఈ రెండు వీడియోలని పోల్చి చూశాకా రెండూ ఒకటే వీడియో అని నిర్ధారించాము. 


వైరల్ వీడియో బిసిసిఐ పత్రికా సమావేశం వీడియో మధ్య పోలిక (సౌజన్యం: ఫేస్బుక్/ది క్వింట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఈ పత్రికా సమావేశాన్ని ఆధారంగా చేసుకుని స్టార్ స్పోర్ట్స్ వారు ఆగస్ట్ 25 నాడు యూట్యూబ్ లో పెట్టిన ఒక వీడియోలో కూడా ఈ బ్యాటింగ్ ఆర్డర్ ఫ్లెక్సిబిలిటీ గురించి రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యల గురించి ఆయన ఇచ్చిన వివరణ ఉంది. ఈ వీడియో వివరణ ఇలా ఉంది- భారతదేశ క్రికెట్ జట్టు కెప్టన్ రోహిత్ శర్మ ఆసియా కప్పు జట్టు ప్రకటన సమావేశంలో తన చమత్కారంతో అందరినీ ఆకట్టుకున్నారు. వైరల్ వీడియోలో ఏ వ్యాఖ్యలు చేశారో  ఈ వీడియోలో 1:30-2:30 సెకన్ల మధ్య అవే వ్యాఖ్యలు ఆయన చెయ్యడం మనం చూడవచ్చు. 

వైరల్ వీడియోలో రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యల గురించి ఈ ఎస్ పి ఎన్ క్రిక్ ఇన్ఫో వారు కూడా ఆగస్ట్ 21 నాడు ఒక కథనం ప్రచురించారు. “ఆలోచనలోనూ, బ్యాటింగ్ ఆర్డర్ లోనూ భారత జట్టు ఫ్లెక్సిబిల్ గా ఉండాలని రోహిత్ కోరుకుంటున్నారు”, అనేది ఈ కథనం శీర్షిక. ఆయన ఈ వ్యాఖ్యలు ఆసియా కప్పుకి భారత జట్టుని ప్రకటించడానికి ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో చేశారని కూడా ఈ కథనంలో తెలిపారు. 

ఇదే విషయాన్ని హిందుస్థాన్ టైమ్స్, ది టెలిగ్రాఫ్ లాంటి వార్తా సంస్థలు కూడా ప్రచురించాయి. 

తీర్పు 

బంగ్లాదేశ్  క్రికెటర్లు తమీమ్ ఇక్బాల్ షకీబ్ అల్ హసన్ మధ్య జరిగిన వివాదానికి రోహిత్ శర్మ జవాబిచ్చారని క్లైమ్ చేస్తూ తన పాత వీడియో ఒకటి షేర్ చేశారు. ఆసియా కప్పుకి భారత జట్టుని ప్రకటించడానికి ఏర్పాటు చేసిన పత్రికా ప్రకటనలో తాను చేసిన వ్యాఖ్యలని క్రాప్ చేసి ఈ వైరల్ వీడియో చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(ఆనువాదం:  రాజేశ్వరి పరస)

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.