ద్వారా: రాజేశ్వరి పరస
సెప్టెంబర్ 15 2023
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ కి విధించిన న్యాయమూర్తి ఫొటో అంటూ వేరే న్యాయమూర్తి ఫొటో షేర్ చేశారు.
నేపధ్యం
కోట్ల రూపాయల కుంభకోణంలో తన పాత్ర ఉందన్న ఆరోపణల మీద ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి సెప్టెంబర్ 10, 2023 నాడు విజయవడాలోని అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ కి సంబంధించి 370 కోట్ల కుంభకోణం జరిగిందని, అందులో చంద్రబాబుకి భాగస్వామ్యం ఉంది అనేవి ఆయన మీద ఆరోపణలు.
క్లైమ్ ఏంటి?
చంద్రబాబు రిమాండ్ తరువాత సామాజిక మాధ్యమాలలో ఒక ఫొటో వైరల్ అయ్యింది. ఆయనకి జ్యుడీషియల్ రిమాండ్ విధించిన న్యాయమూర్తి ఈవిడేనన్న క్లైమ్ తో ఈ ఫొటో షేర్ చేశారు.
ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో ఒకరు ఈ ఫొటో షేర్ చేసి “జస్టిస్ హిమబిందు. సెల్యూట్ మేడమ్. చట్టానికి ఎవరూ అతీతులు కారని మీరు ఒక న్యాయమూర్తిగా నిరూపించారు. చట్టం ముందు అందరూ సమానులే అని మీరు మీ తీర్పు ద్వారా సామాన్య ప్రజలలో ఒక నమ్మకం ఏర్పరిచారు.”, అని రాసుకొచ్చారు.
ఫేస్బుక్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నట్టున్న ‘వై ఎస్ ఆర్ సి పి సోషల్ మీడియా విజయనగరం’ అనే పేజి కూడా ఇదే ఫొటో షేర్ చేసి చంద్రబాబుని అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చినందుకు ఆవిడని మెచ్చుకున్నారు. కొన్ని తెలుగు వెబ్సైట్స్ కూడా ఇదే క్లైమ్ తో ఇదే ఫొటో ని షేర్ చేశాయి. వాటి ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ చూడవచ్చు.
వైరల్ క్లైమ్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
ఇదే ఫొటో వాట్స్ ఆప్ లో కూడా వైరల్ అయ్యింది. ప్రస్తుత ముఖ్యమంత్రి, వై ఎస్ ఆర్ సి పి అధ్యక్షులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి జస్టిస్ హిమబిందుని ఆంధ్ర ప్రదేశ్ న్యాయ కళాశాలల డీన్ గా నియమించారని, దానికి ప్రతిగా విపక్ష నాయకులు చంద్రబాబుని ఆవిడ కారాగారానికి పంపించారనే క్లైమ్ తో ఈ ఫొటో చక్కర్లు కొడుతున్నది.
వాట్స్ ఆప్ లో షేర్ అవుతున్న క్లైమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: వాట్స్ ఆప్/స్క్రీన్ షాట్)
అయితే ఈ రెండు క్లైమ్స్ కూడా తప్పే. జ్యుడీషియల్ రిమాండ్ ఇచ్చిన న్యాయమూర్తి ఫొటోలో ఉన్న న్యాయమూర్తి కాదు.
వాస్తవం ఏమిటి?
డెక్కన్ క్రానికల్ లో సెప్టెంబర్ 11 నాడు వచ్చిన కథనం ప్రకారం చంద్రబాబుకి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కృష్ణా జిల్లా న్యాయస్థానికి చెందిన విజయవాడ ప్రాంత అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో మూడో అదనపు న్యాయమూర్తయిన బి. సత్య వెంకట హిమ బిందు. కృష్ణా జిల్లా న్యాయస్థానం వెబ్సైట్ ప్రకారం విజయవాడలోని ఈ న్యాయస్థానంలో న్యాయమూర్తి హిమ బిందు మే 1 నాడు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. న్యాయస్థానం అధికారిక వెబ్సైట్ లో ఆమె ఫొటో కూడా ఉంది. వైరల్ పోస్ట్ లో ఉన్న మహిళా న్యాయమూర్తి ఈవిడ ఒక్కరు కాదు అనేది ఈ ఫొటో ద్వారా స్పష్టంగా తెలుస్తున్నది.
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు వెబ్సైట్ ప్రకారం విజయవాడకి బదిలీ అవ్వకముందు జస్టిస్ హిమబిందు ప్రత్యేక పోలీసు వ్యవస్థ మరియు అవినీతి నిరోధక శాఖ కోర్టులో అదనపు జిల్లా న్యాయమూర్తిగా విశాఖపట్టణంలో పనిచేశారు.
బి. సత్య వెంకట హిమబిందు ఫొటో (సౌజన్యం: krishna.dcourts.gov.in/స్క్రీన్ షాట్)
వైరల్ ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి మరొక న్యాయమూర్తి అని తెలిసింది. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి న్యాయమూర్తి కె. శ్రీదేవి. ఈవిడ శ్రీకాకుళం జిల్లాలో మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి. ఈ నైపుణ్యాభివృద్ధి కుంభకోణం కేసుకి ఈవిడకి సంబంధం లేదు.
న్యాయమూర్తి శ్రీదేవి ఫొటోని న్యాయమూర్తి హిమబిందు ఫొటోగా షేర్ చేస్తున్నారు.
వైరల్ ఫొటోలో ఉన్న న్యాయమూర్తి పేరు, ఫొటో, పదవి (సౌజన్యం: districts.ecourts.gov.in/స్క్రీన్ షాట్)
రెండవ విషయం ఏమిటంటే జగన్ మోహన్ రెడ్డి హిమ బిందుని ఆంధ్ర ప్రదేశ్ న్యాయ కళాశాలల డీన్ గా నియమించారు అనే దాంట్లో వాస్తవం లేదు. ప్రతి న్యాయ కళాశాలకి ఒక ప్రిన్సిపాల్ ఉంటారు. డీన్ అంటే ఒక విశ్వవిద్యాలయంలో ఒక విభాగానికి అధిపతిగా ఉంటారు. ఉదాహరణకి, ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్సైట్ ప్రకారం ఈ విశ్వవిద్యాలయంలో మొత్తం 9 మంది డీన్స్ ఉన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షలు లాంటి విభాగాలకి వీళ్ళు అధిపతులు. అదే సమయంలో ఈ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల పేరు డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ న్యాయ కళాశాల. ఈ కళాశాలకి అధిపతిగా ప్రిన్సిపాల్ ఉన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి వెబ్సైట్ లో ఉన్న డేటా ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 39 న్యాయ కళశాలలు ఉన్నాయి. అందులో 6 ప్రభుత్వ కళాశాలలు కాగా, మిగతావి ప్రైవేటు సంస్థలు. ప్రతి కళాశాలకి స్వంత ప్రిన్సిపాల్ ఉన్నారు.
తీర్పు
చంద్రబాబుకి 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన న్యాయమూర్తి హిమబిందు ఫొటో అంటూ వేరే న్యాయమూర్తి ఫొటో వైరల్ అయ్యింది. ఈ వైరల్ ఫొటోలో ఉన్న న్యాయమూర్తి శ్రీకాకుళానికి చెందిన కె. శ్రీ దేవి. కాబట్టి ఈ రెండు క్లైమ్స్ అబద్ధం అని మేము నిర్ధారించాము.
(ఈ ఫ్యాక్ట్ చెక్ కి గుత్తా రోహిత్ సహకరించారు)
(అనువాదం- గుత్తా రోహిత్)