హోమ్ భారత దేశం ఆర్థిక సహాయం అందిస్తున్న ప్రాజెక్టులు నిలిపివేయడాన్ని మాల్దీవుల ప్రజలు వ్యతిరేకిస్తున్న వీడియో కాదిది

భారత దేశం ఆర్థిక సహాయం అందిస్తున్న ప్రాజెక్టులు నిలిపివేయడాన్ని మాల్దీవుల ప్రజలు వ్యతిరేకిస్తున్న వీడియో కాదిది

ద్వారా: అజ్రా అలీ

జనవరి 16 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
భారత దేశం ఆర్థిక సహాయం అందిస్తున్న ప్రాజెక్టులు నిలిపివేయడాన్ని మాల్దీవుల ప్రజలు వ్యతిరేకిస్తున్న వీడియో కాదిది సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

మాల్దీవుల ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక గృహ పధకంలో లొసుగులు గురించి స్థానికులు తమ నిరసన తెలియయచేస్తున్న వీడియో ఇది.

క్లైమ్ ఏంటి?

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా లక్షద్వీప్ లో పర్యటించాక, సామాజిక మాధ్యమాలలో యూజర్లు మాల్దీవులు లాంటి చోట్లకి పర్యాటకానికి వెళ్ళే బదులు లక్షద్వీప్ వెళ్ళాలి అని చెప్పటం మొదలుపెట్టారు. అదే సమయంలో మాల్దీవుల రాజకీయ నాయకులు మోదీ గురించి, భారత దేశం గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం తలెత్తింది. దీని కారణంగా మాల్దీవుల మీద విమర్శలు పెరిగాయి. #BoycottMaldives అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అయ్యింది. రాయిటర్స్ కథనం ప్రకారం ఈ వ్యాఖ్యలు చేసిన ముగ్గురు నాయకులని సస్పెండ్ చేయడం జరిగింది. 

ఈ నేపధ్యంలో సామాజిక మాధ్యమాలలో తరుచుగా  తప్పుడు సమాచారం షేర్ చేసే మిస్టర్. సిన్హా అనే యూజర్ తన ఎక్స్ అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఒక కార్యాలయం రిసెప్షన్ ప్రాంతంలో ప్రజలు కూర్చుని, నుంచుని ఉండటం మనం చూడవచ్చు. “మాల్దీవులలో భారత దేశం ఆర్థిక మద్ధతుతో ఒక నివాస ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. అక్కడి అధికారగణం ఈ ప్రాజెక్టుని ఇప్పుడు ఆపేసింది. ఈ నిర్ణయాన్ని ఇప్పుడు అక్కడి స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాల్దీవులలో అంతరుద్ధ్యం ఎంతో దూరంలో లేదు,” అనే శీర్షికతో ఈ వీడియో షేర్ చేశారు. 

ఈ పోస్ట్ కి ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రచురించే సమయానికి మూడు లక్షలకి పైగా వ్యూస్ ఉన్నాయి. ఈ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ  చూడవచ్చు. ఇతరులు కూడా ఇటువంటి క్లైమ్ తోనే ఈ వీడియోని షేర్ చేశారు. అటువంటి పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు. 

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/స్క్రీన్ షాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ క్లైమ్ తప్పని మా పరిశోధనలో తేలింది.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ వైరల్ వీడియోని జాగ్రత్తగా గమనిస్తే అందులో ఉన్న ఒక మహిళ వెనుక ఒక బ్యానర్ ఉంది. దాని మీద “సీయింగ్ యు బెటర్ విత్ వన్ జిఓవి” అని ఉంది. వన్ జిఓవి అనేది మాల్దీవుల పౌరులకి రకరకాల ప్రభుత్వ సేవలు అందించే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. 

వీడియోలో ఉన్న బ్యానర్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

‘మాల్దీవులలో వన్ జిఓవి కార్యక్రమాలు’ (ఆంగ్లం నుండి అనువాదం) అనే కీ వడ్స్ వాడి వెతికితే మాల్దీవుల స్థానిక వార్తా సంస్థ ‘మిహారు’లో నవంబర్ 16, 2023 నాడు ప్రచురితమైన ఒక కథనం మాకు లభించింది. ఈ కథనంలో ఉన్న ఫొటో, వైరల్ వీడియోలోని విజువల్స్ మధ్య చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఫ్లాట్స్ జాబితా గురించి మంత్రిత్వ శాఖాకీ ఫిర్యాదు చేయడానికి జనాలు గుమిగూడి ఉన్నారని ఈ కథనంలో ఉంది.

ఈ మిహారు కథనంలో ఉన్న ఫొటో, వైరల్ వీడియో విజువల్స్ మధ్య అనేక పోలికలని మేము గుర్తించాము. ఉదాహరణకి, గోడ రంగు, ఫాల్స్ సీలింగ్, గోడ గడియారం లాంటివి. 

వైరల్ వీడియో, మిహారు కథనంలో ఫొటోల మధ్య పోలిక (సౌజన్యం: ఎక్స్/స్క్రీన్ షాట్/మిహారు)

దీనిని ధృవీకరించుకోవడానికి లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఈ మిహారు కథనం రచయిత అజీమా నిజార్ ని సంప్రదించింది. వైరల్ వీడియోలో ఉన్న కార్యాలయం, తన కథనంలోని ఫొటోలో ఉన్న కార్యాలయం ఒకటేనని, వైరల్ పోస్ట్ లో చేసిన క్లైమ్ అబద్ధం అని తను మాకు తెలిపారు.

మాల్దీవుల గత ప్రభుత్వం ఒక గృహ పధకాన్ని ప్రవేశపెట్టి, దానికి అర్హులైన వారి జాబితా విడుదల చేసిందని తను మాకు తెలిపారు. మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షులు మహమ్మద్ మొయిజు జనవరి 2 నాడు ఎక్స్ లో పెట్టిన పోస్ట్ ని తను మా దృష్టికి తీసుకువచ్చారు. ఈ పోస్ట్ లో అధ్యక్షులు జాబితా ప్రకారం అర్హులకి రాబోయే రెండు వారాలలో ఫ్లాట్లు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు.

“అయితే ప్రస్తుతం మాల్దీవుల అవినీతి నిరోధక సంస్థ ఈ పధకం మీద విచారణ చేస్తున్నది. అర్హత లేని వారికి ఫ్లాట్లు కేటాయించారని అనేక మంది ఫిర్యాదు చేయడంతో అవినీతి నిరోధక సంస్థ రంగంలోకి దిగింది. సంస్థ తన విచారణ పూర్తి చేశాకనే లబ్ధిదారులకి ఫ్లాట్లు ఇవ్వటం జరుగుతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి నాకు తెలిపారు. అయితే అధ్యక్షులు తెలిపినట్టు తమకి తక్షణమే ఫ్లాట్లకి చెందిన పత్రాలు అందచేయాలి అని లబ్ధిదారులు డిమాండ్ చేస్తునారు. అదే ఈ వీడియో,” అని అజీమా మాకు తెలిపారు.

ఎక్స్ లో ఈ గృహ పధకానికి సంబంధించిన ఫొటోలు అప్లోడ్ చేశారని చెబుతూ, వాటిని మా దృష్టికి అజీమా తీసుకొచ్చారు. “ఈ పధకం ప్రణాళిక ప్రకారం కొనసాగుతున్నది,” అని తను తెలిపారు. 

వన్ జిఓవి వారిని కూడా లాజికల్లీ ఫ్యాక్ట్స్ సంప్రదించింది. వన్ జిఓవి కి చెందిన ట్రేడ్ నెట్ మాల్దీవ్స్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ వరీష్ మహమ్మద్ మాతో మాట్లాడుతూ ఈ వైరల్ వీడియో మాల్దీవులలో సామాజిక గృహ పధకానికి సంబంధించి స్థానిక ప్రజలు తమ నిరసనని తెలుపుతున్న వీడియో అని తెలిపారు. లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు ఎందుకు లేవో తెలుసుకోవటానికి ప్రజలు మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని సందర్శించినప్పటి వీడియో అని మాకు తెలిపారు. 

మాల్దీవుల నిర్మాణం మరియు మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖకి చెందిన ఒక అధికారి ఇదే విషయాన్ని మాకు ధ్రువీకరించారు. భారత దేశం ఆర్థిక సహాయం చేస్తున్న ఏ నిర్మాణం ఆగలేదని, అలాగే దీనికి సంబంధించిన నిరసనేదీ మాల్దీవులలో చోటుచేసుకోలేదని మాకు తెలిపారు.

ఎకనామిక్ టైమ్స్ లో ఒక కథనం ప్రకారం భారత దేశం మాల్దీవులలో కొన్ని నిర్మాణాలకి ఆర్థిక సహకారం అందిస్తున్నది. అందులో హనిమాధూలో విమనాశ్రయం, గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్టు ఉన్నాయి. అయితే దౌత్య విబేధాల కారణంగా ఈ ప్రాజెక్టులెవీ ఆపినట్టు వార్తలు లేవు.

తీర్పు

మాల్దీవుల ప్రభుత్వం సామాజిక గృహ నిర్మాణ పధకం లబ్ధిదారులు తమ నిరసన తెలియచేస్తున్న వీడియోని మాల్దీవులలో భారత దేశం ఆర్థిక సహాయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టులని ప్రభుత్వం ఆపేసినందుకు అక్కడి ప్రజలు నిరసన తెలియచేస్తున్నారంటూ షేర్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ ఆబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్) 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.