ద్వారా: రజిని కె జి
ఆగస్టు 22 2024
ఉత్తర్ ప్రదేశ్ లో ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ లో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణల నేపధ్యంలో నిరసన చేపట్టిన వీడియో ఇది.
క్లైమ్ ఏంటి?
నిరసనకారులు నినాదాలు ఇస్తుండగా భీం ఆర్మీ నాయకులు చంద్రశేఖర్ ఆజాద్ నిరసన తెలుపుతున్న వీడియో ఒకటి షేర్ చేసి, కోల్ కత్తా లో జరిగిన వైద్యురాలి హత్య ఘటనకి వ్యతిరేకంగా తను నిరసన తెలుపుతున్నారని క్లైమ్ చేశారు. భీం ఆర్మీ భారత్ ఏక్తా మిషన్ గా కూడా పిలవబడే భీం ఆర్మీ అనేది ఉత్తర్ ప్రదేశ్ లో చంద్రశేఖర్ 2015 లో ఏర్పాటు చేసిన ఒక అంబేద్కర్ వాద బహుజన సంస్థ.
ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో ఒకరు ఈ వీడియో షేర్ చేసి, "కోల్ కత్తా లో జరిగిన డాక్టర్ <పేరు తొలగించాము> అత్యాచారం, హత్య ఘటనకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టిన చంద్రశేఖర్ ఆజాద్. ఆగస్ట్ 21 నాడు భారత్ బంద్ లో జరిగింది. విప్లవం వస్తుంది అనే నినాదం ఇవ్వండి," అని రాసుకొచ్చారు. ఇటువంటి మరొక పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు.
సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కోల్ కత్తా లోని ఆర్ జి కర్ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ శిక్షణ వైద్యురాలిని అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన నేపధ్యంలో ఈ క్లైమ్ వైరల్ అయ్యింది. ఈ ఘటన దేశవ్యాప్త నిరసనలకి దారి తీసింది. శిక్షణ లో ఉన్న వైద్యులకి అందుబాటులో ఉన్న సదుపాయాలు మెరుగుపరచాలి అని డిమాండ్ బాగా ఉంది. ప్రస్తుతం, ఈ కేసుని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేస్తున్నది.
అయితే, ఈ వైరల్ వీడియో ఈ నిరసనలకి సంబంధించినది కాదు. ఉత్తర్ ప్రదేశ్ లో ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ లో రిజర్వేషన్ లకి సంబంధించి అవకతవకలు చోటుచేసుకున్నాయి అని ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో తీసిన ర్యాలీ ఇది.
మేము ఏమి తెలుసుకున్నాము?
రిజర్వేషన్ కి సంబంధించి చంద్రశేఖర్ ర్యాలీ తీస్తున్న వీడియో ఇది. "రిజర్వేషన్ మా హక్కు", "మేము రిజర్వేషన్లు తీసుకుంటాము", "మీరు ఇవ్వకపోతే మేము రిజర్వేషన్లు లాకకుంటాము" అనే నినాదాలని మనం ఇందులో వినవచ్చు.
ఈ వీడియో లోని కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే, Bheem Army A.S.P (bheem_army_king_) అనే అకౌంట్ ఆగస్ట్ 17, 2024 నాడు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది అని తెలుసుకున్నాము (ఆర్కైవ్ ఇక్కడ). రిజర్వేషన్ లకి సంబంధించి ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన నిరసన వీడియో ఇది అని ఈ పోస్ట్ శీర్షికలో ఉంది. #69000_शिक्षकभर्ती_आरक्षण_घोटाला అనే హ్యాష్ ట్యాగ్ కూడా వాడారు. 69000 ఉపాధ్యాయుల నియామక రిజర్వేషన్ కుంభకోణం అనేది దీని అనువాదం.
వైరల్ వీడియో, ఇన్స్టాగ్రామ్ వీడియో మధ్య పోలికలు (సౌజన్యం: ఇన్స్టాగ్రామ్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
ఆజాద్ కూడా ఇదే వీడియోని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఆగస్ట్ 17 నాడు పోస్ట్ చేశారు (ఆర్కైవ్ ఇక్కడ). ఈ వీడియో వేరే కోణం నుండి ఉంది కానీ, అవే విజువల్స్ ఇందులో కూడా ఉన్నాయి. "#ఫైల్ లాక్కుని మరీ మేము రిజర్వేషన్ సంపాదిస్తాము. 69000 ఉపాధ్యాయుల నియాయక ఉద్యమంలో ఉన్నాను. #69000_शिक्षकभर्ती_आरक्षण_घोटाला," అని ఈ పోస్ట్ లో రాశారు.
గూగుల్ సెర్చ్ చేయాగా, అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ ఆజాద్ ఒక ర్యాలీ నిర్వహించారు అని తెలిసింది. 69000 ఉపాధ్యాయుల నియామకం కోసం కొత్త జాబితా విడుదల చేయమని కోర్టు ఆదేశించింది. 2019 లో జరిగిన పరీక్షలో అవకతవకలు జరిగాయి అని 2021 లో వేసిన ఒక కేసు తీర్పు ఇది.
రాష్ట్ర ప్రాధమిక విద్య విభాగం లో 69000 మంది నియామకం కోసం 2019 లో అసిస్టెంట్ టీచర్స్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ని 2019 లో నిర్వహించారు. అక్టోబర్ 2020 లో దీనికి ఎంపిక అయిన 67867 మంది ఉపాధ్యాయుల పేర్లని రెండు జాబితాలుగా విడుదల చేశారు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి చెందిన అభ్యర్ధులు లేనందున 1133 పోస్టులని ఖాళీగా ఉంచారు.
ఈ నియామక ప్రక్రియని అభ్యర్ధులు తప్పు పట్టారు. కేటగిరీ వారీగా మార్కులు ప్రకటించలేదు అని 2021 లో కేసు వేశారు అని ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనంలో ఉంది.
మెరిస్ట్ జాబితా రివైస్ చేయమని అలహాబాద్ కోర్టు ఆగస్ట్ 2024 లో ఆదేశించింది. కోర్టు ఆదేశాలని పాటిస్తామని, నియామక ప్రక్రియ సజావుగా జరిగేలా చూస్తామని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తెలిపారని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
తీర్పు
ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ గురించి చంద్రశేఖర్ ఆజాద్ ఉత్తర్ ప్రదేశ్ లో నిర్వహించిన ర్యాలీ ని కోల్ కత్తా లో జరిగిన హత్యకి నిరసనగా చేశారు అన్నట్టు షేర్ చేశారు.
(అనువాదం - గుత్తా రోహిత్)