ద్వారా: రాజేశ్వరి పరస
ఆగస్టు 23 2023
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఇచ్చిన వివరణ ప్రకారం కొత్త రేషన్ కార్డులకు ధరఖాస్తులు స్వీకరించడం లేదు.
నేపధ్యం
ఆగస్టు 17, 2023 నాడు ‘తెలంగాణ బిఆర్ఎస్ అజీజ్ ఖాన్’ అనే హ్యాండిల్ నేమ్ తో ఉన్న ఫేస్బుక్ యూసర్ ఈ శీర్షిక తో ఒక పోస్ట్ పెట్టారు, “రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయి. వచ్చే సోమవారం నుండి ధరఖాస్తులు స్వీకరిస్తారు. కొత్తగా రేషన్ కార్డ్ కావాలనుకునే వారు పాత రేషన్ కార్డ్లో మార్పులు చేసుకోవాలనుకునే వారు మార్చుకోగలరు.”
మరొక పోస్ట్ లో భాను లడ్డు అనే ఫేస్బుక్ యూజర్ ఇలా రాశారు, “తెలంగాణ ప్రభుత్వం నుండి శుభవార్త. అందరూ కొత్త రేషన్ కార్డులకి ధరఖాస్తు పెట్టుకోగలరు.” ఈ పోస్ట్ కింద ఒక పోస్టర్ లో ఇలా రాసి ఉంది, “ఆగస్టు 21 నుండి కొత్త రేషన్ కార్డుల ధరఖాస్తులకి అర్జీ పెట్టుకోవచ్చు. అర్హత ఉన్నవారందరికి అప్లై చేసుకోవాలసిందిగా ప్రభుత్వం సూచన ఇచ్చింది. పేరులో కానీ చిరునామాలో కానీ ఎటువంటి తప్పులు ఉన్నా కూడా కొత్త కార్డుకి అప్లై చేసుకోవచ్చు. ఇందుకు కావలసినవి ఆధార కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, చిరునామా ఆధారం మరియు ఆదాయ ధృవీకరణ పత్రం.” ఇదే క్లెయిమ్ వాట్సాప్ లో కూడా చక్కర్లు కొడుతుంది.
కొత్త రేషన్ కార్డ్ గురించి వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్న క్లైమ్స్ (సౌజన్యం: వాట్సాప్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
అయితే ఇది అబద్దం.
వాస్తవం
ఈ క్లెయిమ్ కి సంబందించి ఏమైనా సమాచారం ఉందేమో అని, లాజికల్లి ఫ్యాక్ట్స్ తెలంగాణ పౌర సరఫరాల శాఖ వెబ్సైట్ ను చెక్ చేసింది, అక్కడ దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటనా లేదు.
దీని గురించి గూగుల్ లో వెతుకగా, ఈటీవి వారు చేసిన ఒక వీడియో కథనం వారి యూట్యూబ్ ఛానల్ లో దొరికింది, దీని ప్రకారం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సామాజిక మాధ్యమాలలో కొత్త రేషన్ కార్డ్లు ఇస్తున్నారు అని జరుగుతున్న ప్రచారం అసత్యమని పేర్కొన్నారు. పైగా ప్రస్తుతం రేషన్ కార్డులకు ధరఖాస్తులు స్వీకరించటం లేదు అని కూడా చెప్పారు.
అలాగే నేరుగా ధృవీకరించుకోవడానికి లాజికల్లీ ఫ్యాక్ట్స్ పౌర సరఫరాల శాఖ అధికారులను సంప్రదించింది. ప్రజా సంబంధాల విభాగం నుండి ఒక వ్యక్తి మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డ్లకు ధరఖాస్తులు స్వీకరించట్లేదు అని స్పష్టం చేశారు.
ఇంతకుమునుపు తెలంగాణ ప్రభుత్వం చివరిగా జులై 2021 లో రేషన్ కార్డ్లను జారీ చేసింది. దాని తరువాత ఎటువంటి ధరఖాస్తులను ఆహ్వానించలేదు.
తీర్పు
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డ్ లకు ధరఖాస్తులను ఆహ్వానించలేదు. పౌర సరఫరా శాఖ ప్రజా సంబంధాల విభాగం వారు దీనిని అబద్దం అని తేల్చి చెప్పారు. కనుక మేము దీనిని అబద్దం అని నిర్ధారించాము.