ద్వారా: రాహుల్ అధికారి
మే 3 2024
ఇది క్రాప్ చేసిన వీడియో. ఒరిజినల్ లో మోదీ కాంగ్రెస్ ని విమర్శిస్తూ, తాను ‘రిజర్వేషన్ రద్దు’ చేస్తానని వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
క్లైమ్ ఏంటి?
భారత దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల నేపధ్యంలో సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఇందులో ప్రధాని మోదీ భారతీయ జనతా పార్టీ కనుక ఎన్నికలలో గెలిస్తే రిజర్వేషన్లని రద్దు చేస్తామని అంటునట్టు ఉంది.
ఈ వీడియోలో 3 క్లిప్ లు ఉన్నాయి- రెండు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి సంబంధించినవి, ఒకటి మోదీకి సంబంధించినది. ఇందులో మోదీ “మోదీ గెలిస్తే కనుక, రిజర్వేషన్లు పోతాయి,” అని అంటునట్టు ఉంది. రెండవ క్లిప్ లో, రాహుల్ గాంధీ “నరేంద్ర మోదీ రాజ్యాంగన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన పార్టీ ఎంపీలు స్పష్టంగా చెప్పారు, వాళ్ళు కనుక ఎన్నికలలో గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని, రద్దు చేస్తామని,” అని అనటం వినవచ్చు, ఇంకొక క్లిప్ లో గాంధీ “అయితే, కాంగ్రెస్, ఇండియా కూటమి రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఉన్నాయి,” అని అనటం మనం వినవచ్చు.
“తను అధికారంలోకి వస్తే రిజర్వేషన్ వ్యవస్థని తొలగిస్తానని మోదీయే స్వయంగా చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చటానికే బిజేపీ 400 సీట్లు కావాలి అంటుంది. కాంగ్రెస్, రాహుల్ గాంధీ దానిని ఎప్పటికీ నిజం కానివ్వరు. మా చివరి శ్వాస వరకు పోరాడతాము. ఇవి నా మాటలు కావు. ఇతనివి,” అనే శీర్షికతో ఈ వీడియోని ఒక యూజర్ షేర్ చేశారు. ఈ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు.
వైరల్ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
అయితే, ఈ క్లైమ్ అబద్ధం. మోదీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న వీడియోని ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు.
మేము ఏమి తెలుసుకున్నాము?
భారతీయ జనతా పార్టీ అధికారిక యూట్యూబ్ చానల్ లో అప్లోడ్ చేసిన మోదీ ఎన్నికల వీడియోలని (ఆర్కైవ్ ఇక్కడ) చూశాము. ఈ వైరల్ వీడియోని మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో ఏప్రిల్ 25 నాడు ఒక ర్యాలీలో మాట్లాడుతున్న వీడియో నుండి తీసుకున్నారు అని తెలుసుకున్నాము. ఈ ర్యాలీలో మోదీ ఉపన్యాసం 44:16 నిమిషాలు ఉంది. వైరల్ వీడియోని ఈ వీడియోలో 25:33- 25:39 టైమ్ స్టాంప్ మధ్య చూడవచ్చు.
“మోదీ గెలిస్తే కనుక, రిజర్వేషన్లు ఉండవు” అనే భాగాన్ని సందర్భరహితంగా షేర్ చేశారు. మోదీ వాస్తవానికి కాంగ్రెస్ ని విమర్శిస్తూ, “మరొక్కసారి కాంగ్రెస్ తన ఫ్లాప్ సినిమాని విడుదల చేసింది. కాంగ్రెస్ సినిమాలో రెండే సంభాషణలు ఉన్నాయి. పై నుండి కింద వరకు అందరూ అదే సంభాషనని వల్లవేస్తున్నారు. అందులో మొదటిది, మోదీ గెలిస్తే కనుక నియంతృత్వమే ఇక అని. దీనితో మీరు ఏకీభవిస్తారా? అయినా కూడా వాళ్ళ ఫ్లాప్ సినిమా నడుస్తానే ఉంది. రెండవది ఏమిటంటే, మోదీ గెలిస్తే కనుక రిజర్వేషన్లు మాయమైపోతాయి అని,” అని అన్నారు.
రిజర్వేషన్ గురించి మాట్లాడిన వెంటనే మోదీ, “ఇటువంటి అబద్ధాలను వాళ్ళు ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే మీరు చూసే ఉంటారు, కాంగ్రెస్ సినిమా ట్రైలర్ మ్యానిఫెస్టో రూపంలో రాగానే, దేశ ప్రజలకి వాళ్ళ నిజ స్వరూపం తెలిసిపోయింది. వారి ఉద్దేశాలు అర్థమైపోయాయి,” అని అన్నారు.
మోదీ కాంగ్రెస్ ఓబిసి “కర్ణాటక మోడల్” ని విమర్శిస్తూ, రిజర్వేషన్లని తమ “ఓటు బ్యాంకు”కి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు. మొత్తం వీడియోలో రిజర్వేషన్లు రద్దు చేయటం గురించి మోదీ ఎక్కడా మాట్లాడలేదు.
రాహుల్ గాంధీ మాట్లాడుతున్నది దేని గురించి?
రాహుల్ గాంధీకి చెందిన రెండు క్లిప్ లని కర్ణాటకలో బీజాపూర్ లో కాంగ్రెస్ ప్రచార ర్యాలీలో గాంధీ మాట్లాడిన వీడియో (ఆర్కైవ్ ఇక్కడ) నుండి తీసుకున్నారని తెలుసుకున్నాము. ఈ ఒరిజినల్ ప్రసంగాన్ని ఏప్రిల్ 26 నాడు కాంగ్రెస్ అధికారిక యూట్యూబ్ చానల్ లో లైవ్ స్ట్రీమ్ చేశారు.
మొదటి క్లిప్ ని ఈ వీడియోలో 10:34- 10:50 టైమ్ స్టాంప్ మధ్య చూడవచ్చు. రెండవ క్లిప్ ని 11:10-11:20 టైమ్ స్టాంప్ మధ్య చూడవచ్చు.
2024 ఎన్నికల నేపధ్యంలో బిజేపీ నాయకులు అనంత కుమార్ హెగ్డే, రాజస్థాన్ లోని నగౌర్ బిజేపీ అభ్యర్ధి జ్యోతి మిర్ధా “బిజేపీ గెలిస్తే కనుక రాజ్యాంగాన్ని మారుస్తాము అన్నారు”. “రాజ్యాంగాన్ని మార్చటానికి” 400 సీట్లు కావాలి అని హెగ్డే అనగా, “దేశ ప్రయోజనాల కోసం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దాని కోసం రాజ్యాంగాన్ని మార్చాలి,” అని మిర్ధా అన్నారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమ ఎన్నికల ర్యాలీలలో ఈ వ్యాఖ్యలని ఉటంకించి, మోదీ ప్రభుత్వం కనుక మళ్ళీ వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తారు అని విమర్శించారు.
కాంగ్రెస్ విమర్శలకి మోదీ జవాబు ఇస్తూ, “బిజేపీ రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లని అంతం చేస్తుంది అని వారు చెబుతున్నారు. వాళ్ళకి ఒకటే మాట చెబుతున్నా, బాబాసాహెబ్ తనంతట తానే వచ్చి రాజ్యాంగాన్ని మార్చటం గురించి, రిజర్వేషన్లు అంతం చేయడం గురించి అడిగినా కూడా అది అవ్వదు,” అని అన్నారు.
బిజేపీ నాయకుల వీడియోలని ఎడిట్ చేసి, అబద్ధపు క్లైమ్స్ ని సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు. పార్టీ నాయకులు రాజ్యాంగం మారుస్తామని, రిజర్వేషన్లని అంతం చేస్తామని అంటున్నారంటూ తప్పుదోవ పట్టించే వీడియోలని షేర్ చేస్తున్నారు. లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఈ క్లైమ్స్ ని డీబంక్ చేసింది. కొన్నిటిని ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు.
తీర్పు
ఎడిట్ చేసిన మోదీ వీడియో షేర్ చేసి, తను ఎన్నికలలో గెలిస్తే కనుక రిజర్వేషన్లని రద్దు చేస్తానని అన్నారని క్లైమ్ చేశారు. అయితే ఒరిజినల్ వీడియోలో మోదీ తను ఇలా చేస్తాను అని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నది అంటూ కాంగ్రెస్ ని విమర్శించారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.
(అనువాదం- గుత్తా రోహిత్)