హోమ్ వైరల్ వీడియోలోని వ్యక్తి తెలంగాణాలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పధకం కారణంగా ఆత్మహత్య చేసుకోలేదు

వైరల్ వీడియోలోని వ్యక్తి తెలంగాణాలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పధకం కారణంగా ఆత్మహత్య చేసుకోలేదు

ద్వారా: రోహిత్ గుత్తా

జనవరి 18 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
వైరల్ వీడియోలోని వ్యక్తి తెలంగాణాలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పధకం కారణంగా ఆత్మహత్య చేసుకోలేదు తెలంగాణలో 'మహాలక్ష్మి' పధకం కారణంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఆటో డ్రైవర్ వీడియో అని క్లైమ్ చేస్తూ పెట్టిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఇందులోని వ్యక్తి తెలంగాణాకి చెందిన ఆటో డ్రైవర్ కాదు. తను ఆంధ్ర ప్రదేశ్ లో ఒక రాజకీయ నాయకుని దగ్గర పనిచేసిన వ్యక్తి.

(సూచన: ఈ కథనంలో ఆత్మహత్యకి సంబంధించిన వివరణ, ఫొటోలు ఉన్నాయి. పాఠకులు గమనించగలరు.)

క్లైమ్ ఏంటి?

ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఒక వ్యక్తి తాలూకు భయానకమైన వీడియో ఒక దానిని ఎక్స్ లో షేర్ చేసి ఇందులో ఉన్నది తెలంగాణాలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన “మరొక ఆటో డ్రైవర్” అని క్లైమ్ చేశారు. “అమ్ముడుబోయిన” మీడియా దీని గురించి రిపోర్ట్ చేయడం లేదని కూడా ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు.

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘మహాలక్ష్మి’ పధకం కింద తెలంగాణా మహిళలకి తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి చెందిన కొన్ని కేటగిరీ బస్సులలో ప్రయాణాన్ని ఉచితం చేశారు. ఈ పధకం కారణంగా ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గిపోయిందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఈ క్లైమ్ నేపధ్యం ఇది. 

ఈ క్లైమ్ షేర్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ క్లైమ్ అబద్ధం

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ పోస్ట్ కింద కామెంట్లలో కొంత మంది యూజర్లు ఈ వీడియో ఆంధ్ర ప్రదేశ్ కి చెందినదని కామెంట్ చేశారు. దాని ఆధారంగా కీ వడ్స్ వాడి సెర్చ్ చేస్తే వీ 6 న్యూస్ లో డిసెంబర్ 28, 2023 నాడు వచ్చిన ఒక వార్తా కథనం మాకు లభించింది. ఈ వీడియోలోని స్క్రీన్ షాట్ ఈ కథనంలో ఉంది. ఈ కథనం ప్రకారం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వై ఎస్ ఆర్ సి పి పార్టీకి చెందిన ఒక శాసనసభ్యుని వ్యక్తిగత సహాయకుడు. తను డిసెంబర్ 27, 2023 నాడు చనిపోయారని, పోలీసులు ఈ ఘటనని దర్యాప్తు చేస్తున్నారని ఈ కథనంలో ఉంది. వన్ తెలుగు లాంటి వార్తా వెబ్సైట్లలో, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలలో వచ్చిన వివరాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.

వివిధ కథనాలు ఆత్మహత్యకి సంబంధించి వివిధ కారణాలు ఇచ్చాయి. అయితే ఈ విషయం గురించిన పోలీసు దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నదని మేము తెలుసుకున్నాము.

ఈ కేసు నమోదు అయిన పోలీస్ స్టేషన్ ని లాజికల్లీ ఫ్యాక్ట్స్ సంప్రదించింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజూ యాదవ్ మాతో మాట్లాడుతూ ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో జరిగినదేనని ధ్రువీకరించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు. ఇది సున్నితమైన అంశం కారణంగా మరిన్ని వివరాలు వెల్లడించడం కుదరదని మాతో తెలిపారు.

తెలంగాణాలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ పధకానికి వ్యతిరేకంగా ఆటో డ్రైవర్లు నిరసనలు చేసినట్టు వార్తా కథనాలు అయితే ఉన్నాయి కాని, ఈ విషయం గురించి ఆటో డ్రైవర్లు ప్రాణాలు తీసుకున్న ఘటనేదీ ఇప్పటికివరకు నమోదు కాలేదు.

తీర్పు

ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన సంబంధం లేని ఘటన తాలూకూ వీడియో షేర్ చేసి తెలంగాణాలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పధకం కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ వీడియో అని క్లైమ్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.

(సంపాదకుల మాట: భయంకరమైన విజువల్స్ ఉన్న కారణంగా ఈ వీడియోకి సంబంధించిన లింక్స్ ఏవీ ఈ కథనంలో పొందుపరచటం లేదు.)

(మీకు కానీ, మీకు తెలిసినవారికి కానీ ఇటువంటి విషయాలలో మద్ధతు అవసరమైతే ఎమర్జెన్సీ హెల్ప్ లైన్లని సంప్రదించండి.)

(అనువాదం- గుత్తా రోహిత్)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.