హోమ్ ఆసియా కప్పు 2023 ఫైనల్ మ్యాచ్ ‘ఫిక్స్’ అయ్యిందని వసీం అక్రం ఆరోపించలేదు

ఆసియా కప్పు 2023 ఫైనల్ మ్యాచ్ ‘ఫిక్స్’ అయ్యిందని వసీం అక్రం ఆరోపించలేదు

ద్వారా: ఇషిత గోయల్ జె

సెప్టెంబర్ 26 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఆసియా కప్పు 2023 ఫైనల్ మ్యాచ్ ‘ఫిక్స్’ అయ్యిందని వసీం అక్రం ఆరోపించలేదు భారత దేశం శ్రీలంక మధ్య జరిగిన ఆసియా కప్పు 2023 ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని పాకిస్థాన్ క్రికెటర్ వసీం అక్రమ్ అన్నారని తప్పుగా చెబుతూ సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన పోస్ట్స్ (సౌజన్యం:ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

అబద్ధం

వసీం అక్రమ్ అనని మాటలని సృష్టించి అవి ఆయనకి ఆపాదించారు. ఆయన ఈ ఆరోపణలు చేశారు అనటానికి ఎటువంటి ఆధారం లేదు.

సెప్టెంబర్ 10 నాడు ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక మీద 10 వికెట్ల తేడాతో భారీగా గెలుపొంది భారత దేశం ఎనిమిదవ సారి ఆసియా కప్పు గెలుచుకుంది. ఇంకా 263 బంతులు మిగిలి ఉండగానే భారత దేశం శ్రీలంక పెట్టిన టార్గెట్ ని ఛేదించింది. వన్ డే అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇంత భారీ విజయం (మిగిలిన బంతులు సంఖ్య పరంగా)  సాధించటం ఇదే మొదటి సారి. 

క్లైమ్ ఏంటి?

టోర్నమెంట్ అంతా గెలుస్తూ వచ్చి సెప్టెంబర్ 17 నాటి ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక ఘోరంగా ఓడిపోవటంతో అనేక ఊహాగానాలకి తెర లేపింది. అనేక మంది సామాజిక మాధ్యమాలలో యూజర్స్ ఈ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని క్లైమ్ చేసుకొచ్చారు. ఆసియా కప్పు 2023 ఫైనల్ మ్యాచ్ గురించి మాజీ క్రికెటర్లు కూడా తమ అనుమానాలు వ్యక్తం చేశారంటూ కూడా కొంత మంది యూజర్స్ రాసుకొచ్చారు. 

అటువంటి ఒక వైరల్ పోస్ట్ లో (ఈ పోస్ట్ ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు) మాజీ క్రికెటర్ మరియు పాకిస్థాన్ కి చెందిన క్రికెట్ వ్యాఖ్యాత వసీం అక్రమ్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో మాట్లాడుతూ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని ఆరోపించారని క్లైమ్ చేశారు. “ఈ రోజు శ్రీలంక ఆటతీరుని బట్టి తెర వెనుక ఏదో ఒప్పందం జరిగినట్టు అనిపిస్తుంది. ఫైనల్ వరకు గెలుచుకుంటూ వచ్చిన జట్టు ఫైనల్ మ్యాచ్ లో ఇలా ఆడటం అనేక అనుమానలకి తావిస్తున్నది. అయితే బహుశా  ఐసిసి, బిసిసిఐలని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి మనందరం కూడా మన నోరు కుట్టేసుకుని ఉండాలి ఏమో”, అని వసీం అక్రమ్ అన్నారని ఈ పోస్ట్ లో క్లైమ్ చేశారు. 

ఆసియా కప్పు ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని వసీం అక్రమ్ ఆరోపించారు అంటూ క్లైమ్ చేస్తూ చేసిన సామాజిక మాధ్యమ పోస్టుల స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/స్క్రీన్ షాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

వసీం అక్రమ్ ఇటువంటి వ్యాఖ్య చేశారా?

ఆసియా కప్పు అనేది చాలా ప్రాముఖ్యం కలిగిన అంతర్జాతీయ టోర్నమెంట్ కాబట్టి మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని వసీం అక్రమ్ లాంటి ప్రముఖ వ్యక్తి అని ఉంటే కనుక క్రీడా వార్తలని కవర్ చేసే మీడియా వార్తా సంస్థలు ఈ విషయాన్ని ప్రచురించేవి. అయితే విశ్వసనీయత కలిగిన సంస్థలేవీ ఇటువంటి వార్తని ప్రచురించలేదు. ఆసియా కప్పు ఫైనల్ మ్యాచ్ అయిపోయాక త్వరలో జరగనున్న ఇండియా-ఆస్ట్రేలియా వన్ డే సిరీస్ ‘అనవసరం’ అని వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్య మాత్రం రిపోర్ట్ అయ్యింది. ప్రపంచ కప్పు ముందు జరగనున్న ఈ సిరీస్ క్రీడాకారులకి తగిలిన దెబ్బలని, అలసటని మరింత తీవ్రతరం చేస్తుంది అని ఆయన అన్నట్టు రిపోర్ట్ అయ్యింది.

ఈ ఫేక్ న్యూస్ గురించి వసీం అక్రమ్ పరోక్షంగా తన ఎక్స్ అకౌంట్ లో చేసిన పోస్ట్ ఒకటి మాకు దొరికింది. “సామాజిక మాధ్యమాలలో వచ్చేదంతా నిజమని నమ్మటం జనాలు ఆపేయాలి. మంచిని నమ్మటం కన్నా చెడుని నమ్మటం ఎప్పుడూ తేలికే. ప్రపంచంలో మన భాగంలో ఫేక్ న్యూస్ అనేది అనవసరపు వివాదాలకి దారి తీస్తుంది, ద్వేషాన్ని పెంపొందిస్తుంది, అలాగే మన రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న గొడవని మరింత పెంచుతుంది. అది మనకి అవసరం లేదు. జరిగింది చాలు!”, అని సెప్టెంబర్ 19 నాడు వసీం అక్రమ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

లాజికల్లీ ఫ్యాక్ట్స్ వసీం అక్రమ్ మేనేజర్ ఆర్సలన్ షా ని సంప్రదించింది. వసీం అక్రమ్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేశారు అనేదానిని ఆయన తిరస్కరించారు. “ఇది ఫేక్ న్యూస్, కీ బోర్డ్ యోధులు ద్వేషాన్ని పెంపొందించాలి అనుకోవటం తప్ప ఇందులో వాస్తవం లేదు”, అని ఆయన మాకు తెలిపారు.

మ్యాచ్ తరువాత జరిగిన కార్యక్రమంలో వసీం అక్రమ్ మ్యాచ్ ఫిక్సింగ్ గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని భారతదేశానికి చెందిన క్రీడా విలేఖరి ఖుర్రం హబీబ్ మాకు తెలిపారు. వసీం అక్రమ్ ఆసియా కప్పు షెడ్యూల్ గురించి మాత్రమే మాట్లాడారని ఆయన తెలిపారు. “సామాజిక మాధ్యమాలలో ట్రోల్స్ తమ అభిప్రాయాలు తెలపడానికి ప్రముఖ క్రికెటర్ల పేరు వాడుకుంటుంటారు”, అని ఆయన తెలిపారు.

వసీం అక్రమ్ మ్యాచ్ ఫిక్సింగ్ గురించి అన్నాడని ఆయనకి ఆపాదించిన వ్యాఖ్యనే నాసిర్ హుస్సైన్, ఆండ్రూ సైమండ్స్, చమిందా వాస్ లకి కూడా సామాజిక మాధ్యమాలలో ఆపాదించారు. అయితే వీరెవరూ కూడా ఇటువంటి వ్యాఖ్య చేసినట్టు ఎటువంటి ఆధారం లేదు. 

ఇదే ఆరోపణ వివిధ క్రీడాకారులు చేశారని క్లైమ్ చేస్తూ సామాజిక మాధ్యమాలలో పెట్టిన పోస్టుల స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/స్క్రీన్ షాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

మ్యాచ్ జరిగిన తరువాత బ్రోడ్కాస్ట్ అయిన కార్యక్రమం వీడియో మాకు దొరకలేదు. అయితే దీని గురించి మరింత సమాచారం కోసం స్టార్ స్పోర్ట్స్ వారిని మేము సంప్రదించాము. వారి నుండి జవాబు వస్తే ఇక్కడ తెలియచేస్తాము.

తీర్పు

ఆసియా కప్పు 2023 ఫైనల్ మ్యాచ్ ని భారతదేశం, శ్రీలంక ఫిక్స్ చేశాయని వసీం అక్రమ్ అన్నారని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదు. కాబట్టి లేని వ్యాఖ్యని సృష్టించి దానిని సామాజిక మాధ్యమాలలో సర్కులేట్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.

 

(ఈ ఫ్యాక్ట్ చెక్ కి సందున్ ఆరోషా ఫెర్నాండో సహకరించారు)

 

(అనువాదం- గుత్తా రోహిత్)

 

 

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.