హోమ్ నారా లోకేష్ కారులో 8 కోట్ల నగదు పట్టుబడలేదు

నారా లోకేష్ కారులో 8 కోట్ల నగదు పట్టుబడలేదు

ద్వారా: రోహిత్ గుత్తా

మార్చి 27 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
నారా లోకేష్ కారులో 8 కోట్ల నగదు పట్టుబడలేదు పోలీసు తనిఖీలో నారా లోకేష్ కారులో ఎనిమిది కోట్లకి పైగా నగదు పట్టుబడింది అని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

లోకేష్ కారులో డబ్బేమి పట్టుబడలేదని ఆ కారుని తనిఖీ చేసిన పోలీసు అధికారి స్పష్టం చేశారు.

క్లైమ్ ఏంటి?

ఒక వాహన కాన్వాయ్ ని పోలీసులు తనిఖీ చేస్తున్న 11 సెకన్ల వీడియో క్లిప్ ఒకటి షేర్ చేసి తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కారులో 8 కోట్లు పట్టుబడ్డాయని క్లైమ్ చేశారు. లోకేష్ మంగళగిరి తెలుగుదేశం అభ్యర్ధి కూడా. ఈ పోస్ట్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ  చూడవచ్చు. ఇదే వీడియో, ఇదే క్లైమ్ తో వాట్స్ ఆప్ లో కూడా సర్కులేట్ అవుతున్నది.

ఆంధ్ర ప్రదేశ్ లో శాసనసభ, లోక్ సభ ఎన్నికలు మే 13, 2024 నాడు జరగనున్నాయి. ఫలితాలు జూన్ 4 నాడు ప్రకటించనున్నారు. ఎన్నికల ప్రకటనతో భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మార్చ్ 16 నుండి అమలులోకి వచ్చింది. 

ఈ కోడ్ అమలులోకి వచ్చాక ఏ అభ్యర్ధి కారులోనైనా యాభై వేలకి మించి నగదు ఉంటే ఆ డబ్బుని జప్తు చేసే అధికారం ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘానికి ఉంటుంది. 

వైరల్ సామాజిక మీడియా పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: వాట్స్ ఆప్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

మేము ఏమి తెలుసుకున్నాము?

లోకేష్ కారులో నగదు జప్తు గురించిన వార్తా కథనాల కోసం వెతికాము. దానికి సంబంధించి విశ్వసనీయమైన కథనాలు ఏమీ లభించలేదు. మార్చ్ 20 నాడు ఉండవల్లి దగ్గర లోకేష్ కారుని పోలీసులు తనిఖీ చేస్తున్న వీడియో నుండి వైరల్ వీడియోని క్లిప్ చేశారని కీ వర్డ్ సెర్చ్ ద్వారా తెలుసుకున్నాము. ఉండవల్లి గ్రామం గుంటూరు జిల్లాలో తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది.

ఈ తనిఖీ గురించి ఏబీఎన్, మహా న్యూస్ లాంటి తెలుగు చానళ్ళు వీడియో కథనాలు ప్రసారం చేశాయి. లోకేష్ ఐదు వాహనాల కాన్వాయ్ లో ప్రచారం కోసం వెళ్తున్నప్పుడు ఈ కాన్వాయ్ ని పోలీసులు ఉండవల్లి దగ్గర ఆపారని, పోలీసుల తనిఖీలో ఏమి దొరకలేదని ఈ కథనంలో ఉంది. కోడ్ అమలులోకి వచ్చాక ఇలా వాహనాలు తనిఖీ చేయడం అనేది సర్వసాధారణం. 

లాజికల్లీ ఫ్యాక్ట్స్ మార్చ్ 20 నాడు తనిఖీ నిర్వహించిన తాడేపల్లి పోలీసులని సంప్రదించింది. కారులో ఎనిమిది కోట్లకి పైగా నగదు దొరికింది అనే విషయాన్ని తాడేపల్లి ఎస్. ఐ కొట్టిపారేశారు. ఆ రోజు తను, తన బృందం ఆ కాన్వాయ్ ని తనిఖీ చేశామని, అందులో నగదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.

తీర్పు

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా లోకేష్ కారుని తనిఖీ చేశారు. అయితే ఆయన వాహనాలలో ఈనాటి వరకు నగదు అయితే దొరకలేదు, జప్తు చేయలేదు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.  

(అనువాదం- గుత్తా రోహిత్)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.