ద్వారా: మొహమ్మద్ సల్మాన్
అక్టోబర్ 30 2024
ఒరిజినల్ వీడియో లో కింగ్ చార్లెస్ III తన స్వీయ చిత్రం ఉన్న పోస్టర్ ను విడుదల చేయటం జరిగింది.
క్లెయిమ్ ఏమిటి?
సామాజిక మాధ్యమాలలో కింగ్ చార్లెస్ III ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ‘టెర్రరిస్ట్’ అంటూ పోస్టర్ విడుదల చేసినట్టుగా ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ పోస్టర్ లో నెతన్యాహు ను తక్షణమే అరెస్ట్ చెయ్యాలి అంటూ కూడా నినాదం కనిపిస్తుంది.
ఈ వైరల్ అవుతున్న పోస్టర్ లో ఇజ్రాయెల్ ప్రధాని ముఖ చిత్రం ఆయన పేరు తో సహా ‘టెర్రరిస్ట్’ అని రాసి ‘ఈ ఉగ్రవాది మానవ జాతికే ప్రమాదం. ఇతనిని తక్షణమే అరెస్ట్ చెయ్యాలి’ అంటూ పేర్కొని ఉంది.
ఒక ఫేస్బుక్ యూజర్ ఈ వీడియోని షేర్ చేసి, “యూరప్ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ విషయం పై నిన్న ఒక పెద్ద పోస్టర్ విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా వైరల్ చేయండి,” అంటూ రాసుకొచ్చారు.
ఇదే వీడియోని ఇతర భాషలలో కూడా షేర్ చేయటం జరిగింది, వాటి ఆర్కైవ్ లింకులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
కానీ మా పరిశోధన ప్రకారం వైరల్ అవుతున్న వీడియో ఎడిట్ చేయబడినది. అసలయిన వీడియోలో కింగ్ చార్లెస్ తన స్వీయ చిత్రాన్ని ఆవిష్కరించుకున్నారు.
మేము ఏమి కనుగొన్నాము?
వైరల్ అవుతున్న వీడియోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా మే 14, 2024 నాడు ‘ది రాయల్ ఫామిలీ ఛానల్’ అనే యూట్యూబ్ ఛానెల్ అప్లోడ్ చేసిన వీడియోకు దారితీసింది (ఆర్కైవ్). ఇందులో, కింగ్ చార్లెస్ తన చిత్రాన్ని తానే ఆవిష్కరించుకున్నట్టు తెలుస్తుంది. ఈ వీడియోకి వివరణ గా, కింగ్ చార్లెస్ తన పట్టాభిషేకం అనంతరం ఆవిషక్రించిన మొట్ట మొదటి అధికారిక చిత్రం అని పేర్కొని ఉంది.
ఇదే వీడియోని అసోసియేటెడ్ ప్రెస్ యూట్యూబ్ ఛానల్ కూడా మే 15, 2024 నాడు షేర్ చేయటం జరిగింది (ఆర్కైవ్ ఇక్కడ)
వైరల్ అవుతున్న వీడియోను ఈ రెండు ఒరిజినల్ వీడియోలతో పోల్చి చూస్తే, ఎడిట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒరిజినల్ గా ఉన్న వీడియోలో కింగ్ చార్లెస్ ముఖ చిత్రం ఉండగా, దానిని ఎడిట్ చేసి బెంజమిన్ నెతన్యాహు చిత్రం పెట్టి షేర్ చేసారు.
మే 14, 2024 నాడు, ది బిబిసి ఒక కథనాన్ని ప్రచురించింది, ఈ కథనం ప్రకారం, బుకింఘం పాలస్ లో అధికారికంగా కింగ్ చార్లెస్ చిత్రాన్ని ఆవిష్కరించినట్టుగా తెలుస్తుంది. ఆ పెద్ద పెయింటింగ్ లో కింగ్ చార్లెస్ వెల్ష్ గార్డ్ యూనిఫామ్ ను ధరించి ఉన్నారు. ఈ పెయింటింగ్ పరిమాణం, 8 ఫీట్ల 6 ఇంచులు పొడవు మరియు 6 ఫీట్ల 6 ఇంచుల వెడల్పు ఉన్నట్టుగా పేర్కొంది. ఈ పెయింటింగ్ ను జోనాథన్ ఈఓ వేసినట్టు తెలియజేసారు. ఈ కళాకారుడు గతం లో టోనీ బ్లెర్, సర్ డేవిడ్ అట్టెన్బరో మరియు మలాలా యూసప్జాయ్ చిత్రాలను కూడా వేసినట్టు ప్రసిద్ధి.
పైగా, యూరోప్ లో నెతన్యాహు ను ఉగ్రవాది గా ప్రకటించినట్టు ఏమైనా కథనాలు ఉన్నాయా అని వెతికి చూసాము, అటువంటి వార్తా కథనాలు ఏమి మాకు లభించలేదు.
తీర్పు
మా పరిశోధన ప్రకారం, ఒక ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేసి తప్పుగా కింగ్ చార్లెస్ III ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ను టెర్రరిస్ట్ గా ప్రకటించినట్టు షేర్ చేస్తున్నారు.
(అనువాదం : రాజేశ్వరి పరసా)