ద్వారా: రోహిత్ గుత్తా
ఆగస్టు 10 2023
చనిపోయిన వ్యక్తి మాజీ గ్రామ రెవెన్యూ సహాయకుడు అని పోలీసులు నిర్ధారించారు. చనిపోయిన వ్యక్తి రైతు కాదని ఆయన కుటుంబసభ్యులలో ఒకరు స్పష్టం చేశారు.
(హెచ్చరిక- ఈ ఫ్యాక్ట్ చెక్ లో ఆత్మహత్య గురించిన ప్రస్తావన ఉంది. పాఠకులు గమనించగలరు.)
నేపధ్యం
డాక్టర్. సందీప్ పంచకర్ల అనే ట్విట్టర్ యూజర్ జులై 19 నాడు ఆత్మహత్య చేసుకున్న ఒక వ్యక్తి ఫొటో షేర్ చేసి ప్రభుత్వ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రైతు అని క్లైమ్ చేశారు. ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న గదిలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటం ఉంది. తన ట్విట్టర్ బయో ప్రకారం సందీప్ పంచకర్ల భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ (తెలుగు చలనచిత్ర నటుడు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన పార్టీ) బాధ్యుడు. పైన పేర్కొన్న ఫొటో షేర్ చేసి “జగన్ అరాచక పాలనకు నిదర్శనం. వైసీపీ నేతలు అరాచకాలకు రైతన్న బలి. ప్రభుత్వ కార్యాలయంలో ఉరేసుకుని చనిపోయిన రైతు గోవిందప్ప,” అని రాసుకొచ్చారు.
ఈ ట్వీట్ కి ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రచురించే సమయానికి 2150కి పైగా రీట్వీట్లు, 4400 కి పైగా లైకులు ఉన్నాయి. రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తిస్తున్నారంటూ కొంత మంది యజార్లు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఈ వ్యక్తి రైతు కాదు.
వాస్తవం
స్థానిక తెలుగు వార్తాపత్రిక ‘దిశ డైలీ’ ప్రకారం 72 సంవత్సరాల ఒక ముసలి వ్యక్తి చిత్తూరు జిల్లాలోని గుడపల్లి మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో జులై 14 నాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.
సామాజిక మాధ్యమాలలో చలామణిలో ఉన్న ఈ ఫొటో ఈ 72 సంవత్సరాల వ్యక్తిదేనని గుడపల్లి పోలీసులు లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి ధృవపరిచారు. “ఆత్మహత్య చేసుకుని చనిపోయారు అని చెప్పబడుతున్న ఈ వ్యక్తి వివరాలు మేము తెలుసుకున్నాము. ఈ వ్యక్తి మాజీ గ్రామ రెవెన్యూ సహాయకుడు. ఈయన తన భార్య, కుటుంబం నుండి దూరంగా ఉంటున్నాడు. గుడపల్లి మండల రెవెన్యూ కార్యాలయం ఆవరణలో ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆత్మహత్యకి కారణాలు ఏమిటో ఇంకా తెలియదు. ఇప్పటికైతే ఆత్మహత్య కేసుగా నమోదు చేశాము,” అని ఈ కేసుని విచారిస్తున్న ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి తెలిపారు.
ఈ చనిపోయిన వ్యక్తి దత్త పుత్రునితో కూడా లాజికల్లీ ఫ్యాక్ట్స్ మాట్లాడింది. తాము వ్యవసాయదారులం కాదని, తమకి భూమి లేదని తను తెలిపారు. ఆన్లైన్ లో సర్కులేట్ అవుతున్న ఫొటో తన తండ్రిదేనని ఆయన ధ్రువీకరించారు. “తన తండ్రి రైతు అని పుకార్లు చలామణిలో ఉన్నాయి. అయితే ఆయన మాజీ గ్రామ రెవెన్యూ సహాయాకుడు. మాకు వ్యవసాయానికి ఏ సంబంధం లేదు,” అని ఆయన లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి తెలిపారు. “ఒక ఐదు సంవత్సరాల క్రితం ఆయన అనారోగ్యం పాలయ్యారు. అధికారులకి విన్నవించుకుని, ఆయన అనారోగ్యానికి సంబంధించిన వైద్య ధృవీకారణపత్రం సమర్పించాక నేను ఆయన గ్రామ రెవెన్యూ సహాయకుడి ఉద్యోగంలో చేరాను. తల్లిఅగ్రహారం గ్రామ రెవెన్యూ సహాయకుడిగా నేను పనిచేస్తున్నాను,” అని ఆయన తెలిపారు.
ఈ కేసుకి సంబంధించి ఈ ముసలాయన దత్త పుత్రుడు పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదు, ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్. ఐ. ఆర్ ప్రతులని లాజికల్లీ ఫ్యాక్ట్స్ సంపాదించింది. వీటిల్లో చనిపోయిన వ్యక్తి రైతు అని ఎక్కడా లేదు.
తీర్పు
గుడపల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో విగతజీవుడిగా కనిపించిన వ్యక్తి రైతు కాదు. ఆయన మాజీ గ్రామ రెవెన్యూ సహాయకుడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించటానికి ఆయన ఫొటోని ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు ఫొటోగా చలామణి చేస్తున్నారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారిస్తున్నాము.
(మీకు మద్ధతు అవసరం అనుకుంటే భారతదేశానికి సంబంధించి ఇరవై నాలుగు గంటలు పనిచేసే మానసిక ఆరోగ్యం హెల్ప్ లైన్ నంబర్ 14416 ని సంప్రదించండి.)