ద్వారా: రాహుల్ అధికారి
అక్టోబర్ 6 2023
మరింత నిడివి ఉన్న ఇదే వీడియో చూస్తే వాస్తవంగా రాహుల్ గాంధీ మోదీని ఈ విషయం మీద విమర్శించారు అని తెలుస్తుంది.
క్లైమ్ ఏంటి?
కశ్మీర్ లో ప్రజలు త్రివర్ణ పతాకం ఎగరేయటం చూశాక విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, ఇతర బిజెపి నేతలని ప్రశంసించారు అని చెబుతూ ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో సర్కులేట్ అయ్యింది. “దేశంలోనే అత్యంత ఉగ్రవాద వ్యాప్తి ఉన్న జిల్లాలో ఎటు చూసినా త్రివర్ణ పతాకమే కనిపిస్తున్నది. ఈ త్రివర్ణ పతాకాన్ని ఎవరు ఎగరేశారు? మాతో పాటు కేవలం 125 యాత్రికులు ఉన్నారు. కశ్మీర్ ప్రజలే త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. ఒక్కరూ కాదు, వేల మంది ఎగరేశారు. కశ్మీర్ అంతటా ఇదే కథ. ఉగ్రవాద వ్యాప్తి జిల్లాలుగా పేరుపొందిన అనంత్ నాగ్, పుల్వామా కానీ, కొండలు, కోనలు, రోడ్లు, ముందు, వెనకాల, ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకమే. ఎవరి చేతుల్లో? కశ్మీరీ యువత చేతుల్లో”, అని ఈ 54 సెకన్ల వైరల్ క్లిప్ లో రాహుల్ గాంధీ మాట్లాడటం మనం చూడవచ్చు.
ఈ వైరల్ క్లిప్ రెండు భాగాలుగా ఉంది. పై భాగంలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్న విజువల్ ఉండగా, కింద భాగాన మోదీ, హోమ్ మంత్రి అమిత షా నవ్వుతూ తమ ఫోన్ చూసుకుంటున్న ఫొటో ఉంది. “రాహుల్ గాంధీ కూడా ప్రధాని మోదీ విధానాలని ప్రశంసిస్తున్నారు. ఉగ్రవాద వ్యాప్తి ఉన్న జిల్లాలలో కూడా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్నదని ఆయన అన్నారు”, అనే శీర్షికతో ఈ వీడియో క్లిప్ ని అనేక మంది యూజర్లు ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో షేర్ చేశారు. అటువంటి ఒక పోస్ట్ కి ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రచురించే సమయానికి 271 లైకులు, 259 రీపోస్ట్స్ ఉన్నాయి. ఈ పోస్ట్స్ ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఎక్స్ లో షేర్ చేసిన వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/స్క్రీన్ షాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
మేము ఏమి తెలుసుకున్నాము?
ఈ వీడియో కీఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే ఫిబ్రవరి 26 నాడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం నుండి ఈ క్లిప్ తీసుకున్నారని అర్థమయ్యింది. 50 నిమిషాలకి పైగా ఉన్న ఈ వాస్తవ ప్రసంగాన్ని రాహుల్ గాంధీ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో లైవ్ స్ట్రీమ్ చేశారు. ఛత్తీస్గఢ్ లోని రాయపూర్ లో ఫిబ్రవరి 24-26 మధ్య జరిగిన కాంగ్రెస్ 85 వ ప్లీనరీ సెషన్లో ఈ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం లో 29:50 నుండి 30:53 సెకన్ల మధ్య ఉన్న భాగాన్ని క్రాప్ చేసి వైరల్ చేశారు. ఈ క్లిప్ ని సందర్భరహితంగా షేర్ చేసి కశ్మీర్ లో ప్రజలు త్రివర్ణ పతాకం ఎగరవేయటం చూసి రాహుల్ గాంధీ మోదీని పొగిడారని క్లైమ్ చేశారు.
అయితే వాస్తవంగా ఈ వైరల్ క్లిప్ లో ఉన్న వ్యాఖ్య తరువాతనే రాహుల్ గాంధీ మోదీని విమర్శించటం మనం చూడవచ్చు. “పార్లమెంట్ లో ప్రధాన మంత్రి ప్రసంగం విన్నాను. కశ్మీర్ లోని శ్రీనగర్ లో ఉన్న లాల్ చౌక్ దగ్గర త్రివర్ణ పతాకం ఎగరేశానని ఆయన అన్నారు. ప్రధాన మంత్రికి విషయం అర్థం కాలేదేమో అని నాకు అనిపించింది. ప్రధాన మంత్రి 15-20 మంది బిజెపి నాయకులతో వెళ్ళి త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. అయితే భారత్ జోడో యాత్ర సందర్భంగా లక్షల మంది కశ్మీరీ యువత త్రివర్ణ పతాకం ఎగరేశారు. ఈ తేడా ప్రధాన మంత్రికి అర్థం కాలేదు. హిందుస్థాన్ అన్నా, త్రివర్ణ పతాకం అన్నా ప్రేమని జమ్మూ కశ్మీర్ యువతలో మనం పెంపొందించాము. త్రివర్ణ పతాకం పట్ల జమ్మూ కశ్మీర్ యువతకి ఉన్న ప్రేమని మీరు ధ్వంసం చేశారు. మీకు మాకు మధ్య తేడా అది”, అని రాహుల్ గాంధీ ప్రసంగించారు.
రాహుల్ గాంధీ ప్రసంగంలో ఈ భాగాన్ని కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఫిబ్రవరి 26 నాడు పోస్ట్ చేసింది.
రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపధ్యం ఏమిటి?
ఇండియా టుడేలో ఫిబ్రవరి 26 నాడు వచ్చిన ఒక కథనం ప్రకారం ఫిబ్రవరి 8 నాడు(ఆడే సమయానికి రాహుల్ గాంధీ తన తొలి దశ భారత్ జోడో యాత్ర ముగించారు) మోదీ రాహుల్ గాంధీని ఉద్దేశించి పార్లమెంట్ లో పరోక్షంగా చేసిన విమర్శని తిప్పికొడుతూ ఫిబ్రవరి 26 నాడు ఛత్తీస్గఢ్ లో ఒక ర్యాలీలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. 1991లో జరిగిన ఏక్తా యాత్రని గుర్తుచేస్తూ ప్రధాని మోదీ, “నేను గత శతాబ్దం గురించి మాట్లాడుతున్నాను. అప్పట్లోనే శ్రీనగర్ లోని లాల్ చౌక్ దగ్గర త్రివర్ణ పతాకం ఎగరేశాను నేను”, అని అన్నారు. ఏక్తా యాత్ర అనేది 1991లో బిజెపి నిర్వహించిన ఒక రాజకీయ యాత్ర.
హిందుస్థాన్ టైమ్స్ కూడా ఇదే విషయాన్ని ప్రచురించి, “భారత్ జోడో యాత్ర అప్పుడు తాను త్రివర్ణ పతాకాన్ని ఎగరేయటాన్ని రాహుల్ గాంధీ మోదీ ఒకప్పుడు ఎగరేసిన దానితో పోల్చి, భారత్ జోడో యాత్ర అప్పుడు లక్షల మంది ఎగరేశారని తెలిపారు”, అని వివరించింది.
తీర్పు
కశ్మీర్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసినందుకు రాహుల్ గాంధీ మోదీ, ఇతర బిజెపి నాయకులని పొగిడారు అంటూ సందర్భరహిత వీడియో క్లిప్ ఒకటి షేర్ చేసి క్లైమ్ చేశారు. ఛత్తీస్గఢ్ లో ఒక ర్యాలీలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలని క్రాప్ చేసి ఈ వైరల్ వీడియో చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.
(అనువాదం- గుత్తా రోహిత్)