ద్వారా: అంకిత కులకర్ణి
ఆగస్టు 29 2023
బుర్జ్ ఖలీఫా మీద ఆగస్టు 14వ తారీఖున రాత్రి 8 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ 76వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ దేశ జెండాని ప్రదర్శించారు.
నేపధ్యం
బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అతిపెద్ద ఆకాశ హర్మ్యం. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయిలో ఉంది. ఈ భవంతి మీద ప్రత్యేకమయిన సందర్భాలలో ఆ సందర్భానికి సంబంధించిన చిహ్నాలనుప్రదర్శిస్తుంటారు. పొరుగు దేశాలు అయినటువంటి పాకిస్థాన్ మరియు ఇండియాలు ఆగస్టు 14 మరియు ఆగస్టు 15వ తేదీన వారి స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకున్నాయి. దీని తరువాత కొంత మంది వ్యక్తులు సామాజిక మాధ్యమాలలో బుర్జ్ ఖలీఫా మీద భారతీయ జెండా ప్రదర్శించారు కానీ పాకిస్థాన్ జెండాను ప్రదర్శించలేదు అంటూ క్లెయిమ్ చేశారు.
ఒక X (పూర్వపు ట్విట్టర్) యూజ పోస్ట్ షేర్ చేస్తూ ఇలా రాశారు, “బుర్జ్ ఖలీఫా ఈ సారి పాకిస్థాన్ జెండాని ప్రదర్శించడానికి నిరాకరించిది. ధన్యవాదాలు యూఏఈ. ఈ సంవత్సరంలో ఇదే పెద్ద ప్రాంక్ #14ఆగస్టు బ్లాక్ డే.” ఈ పోస్ట్ కు ఈఫ్యాక్ట్ చెక్ ప్రచురించే సమయానికి 846,000 వ్యూస్ ఉన్నాయి, ఇదే పోస్ట్ లో బుర్జ్ ఖలీఫా చుట్టూ జనాలు గుమిగూడి ఉన్న ఒక వీడియో కూడాషేర్ చేశారు.
ఈ వీడియో రికార్డు చేసిన వ్యక్తి కెమెరా ముందు కనపడకపోయినా అతని మాటలు మనం వినవచ్చు. “ఇప్పుడు సమయం అర్దరాత్రి 12:01. అయితే బుర్జ్ ఖలీఫా అధికారులు పాకిస్థాన్ జాతీయ జెండాను ప్రదర్శించము అని తెలపారు. అలాగే ఈ జెండా కనపడదు ఇక. ఇది మన పరిస్థితి. పాకిస్థాన్ వాళ్ళు ఇక్కడ నినాదాలు చేస్తున్నారు, అయిన కూడా పాకిస్థాన్న్ జెండాని బుర్జ్ ఖలీఫా మీద ప్రదర్శించలేదు. ఇది చాలా బాధాకరం. పాకిస్థాన్ ప్రజలను అపహాస్యం చేశారు”, అని ఆ వ్యక్తి అందులో మాట్లాడుతున్నట్టు మనం వినవచ్చు.
ఇదే వీడియోని ఇంకొంతమంది సామాజిక మాధ్యమాల యూజర్ లు షేర్ చేస్తూ, బుర్జ్ ఖలీఫా పాకిస్థాన్ జాతీయ జెండాఅని ఆగస్టు 14 నాడు ప్రదర్శించకుండా పాకిస్థాన్ నోరు మూపించిందని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమాలలో వస్తున్న క్లైమ్స్ ఫొటో (సౌజన్యం : X/@@miryar_baloch, @DeewanPreem, @Budget2023)
అయితే బుర్జ్ ఖలీఫా మీద పాకిస్థాన్ జెండాను ప్రదర్శించలేదు అనేది అబద్దం.
వాస్తవం
లాజికల్లీ ఫ్యాక్ట్స్ చేసిన పరిశోధన ప్రకారం బుర్జ్ ఖలీఫా మీద పాకిస్థాన్ మరియు ఇండియా జాతీయ జెండాను వారి వారి స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రదర్శించాయి. అయితే పాకిస్థాన్ జెండా, అర్దరాత్రి 12 గంటలకు ప్రదర్శించలేదు. అందువలనే ఇలాంటి తప్పుడు సమాచారం సర్క్యులేట్ అయ్యింది. బుర్జ్ ఖలీఫా వారి అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంటు ప్రకారం బుర్జ్ ఖలీఫా మీద పాకిస్థాన్ జెండాను ఆగస్టు 14 నాడు సాయంత్రం 7:50కు ప్రదర్శించారు.
బుర్జ్ ఖలీఫా పై వెలుగుతున్న పాకిస్థాన్ జెండా వీడియోని షేర్ చేస్తూ, బుర్జ్ ఖలీఫా వారు తమ ఇన్స్టాగ్రామ్ అకౌంటులో ఇలా రాశారు,, “ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుర్జ్ ఖలీఫా వెలుగులతో నిండింది.. పాకిస్థాన్ ప్రజలందరికీ ఈ రోజు ఐక్యమత్యం, గౌరవం, సంపన్నతతో కూడిన దినోత్సవం. మీ గొప్ప దేశం యొక్క గొప్ప వారసత్వాన్ని, విజయాలకి సూచికైనా ఈ దినోత్సవం నాడు మీకు మా శుభాకాంక్షలు. రాబోయే రోజులలో ఇంతకుమించి సంతోషాలని విజయాలు మీకు దక్కాలని కోరుకుంటూ పాకిస్థాన్ ప్రజలకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఆగస్టు 21 నాడు ఈ క్లిప్ చెక్ చేసినపుడు ఈ పోస్ట్ 7 రోజుల క్రితం పెట్టినట్టుగా ఉంది. అంటే ఇది ఆగస్టు 14వ తారీఖున పెట్టినట్టుగా తెలిస్తుంది.
ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు సమాదానంగా బుర్జ్ ఖలీఫా అకౌంటు సమాధానం ఇస్తూ పాకిస్థాన్ జాతీయ జెండా ఆగస్టు 14న సాయంత్రం 7:50కు ప్రదర్శించారు అని తెలిపింది.
బుర్జ్ ఖలీఫా ఇన్స్టాగ్రామ్ అకౌంటు మరియు ఒక యూజర్ కి ఇచ్చిన జవాబు ఫొటో (సౌజన్యం : ఇన్స్టాగ్రామ్/burjkhalifa)
యుఏఈ కి సంబందించిన ఒక వార్తా సంస్థ గల్ఫ్ టుడే వారి ఫేస్బుక్ పేజీ లో బుర్జ్ ఖలీఫా పాకిస్థాన్ జెండా ను ప్రదర్శించిన ఒక వీడియో షేర్ చేసింది. “పాకిస్థాన్ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా బుర్జ్ ఖలీఫా”, అనేది ఈ వీడియో శీర్షిక.
డెయిలీ పాకిస్థాన్ రాసిన ఒక కథనం కూడా ఒక వీడియోని షేర్ చేస్తూప్రపంచలో అత్యంత ఎత్తైన భవంతిపై పాకిస్థాన్ జెండా అని రాసింది. అ కథనం లో చాలా మంది పాకిస్థాన్ ప్రజలు ఆ దేశ జెండాని ఆగస్టు 13-14 అర్ధరాత్రి ప్రదర్శించలేదు అని కోపం తెచ్చుకున్నారు అని కూడా రాసింది. “కొంత ఆలస్యంగా దక్షిణ ఆసియా దేశ స్వాతంత్రానికి చిహ్నంగా బుర్జ్ ఖలీఫాపై తెలుపు మరియు ఆకు పచ్చ రంగులు వెలుగుతున్నాయి,” అని రాసి ఉంది.
తీర్పు
పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం నాడు బుర్జ్ ఖలీఫా ఆ దేశ జాతీయ జెండా ను ప్రదర్శించింది. కాకపోతే అర్దరాత్రి కాకుండా సాయంత్రం నాడు ప్రదర్శించింది. కనుక, ఆ దేశ జెండా ఆగస్టు 14 నాడుప్రదర్శింపబడలేదు అనే క్లైమ్ అబద్ధం.
అనువాదం- గుత్తా రోహిత్