హోమ్ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు రద్దు చేసిన గ్రూప్-1 పరీక్షలు నిర్వహించింది వై ఎస్ ఆర్ సి పి పాలనలో, తెలుగుదేశం పాలనలో కాదు

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు రద్దు చేసిన గ్రూప్-1 పరీక్షలు నిర్వహించింది వై ఎస్ ఆర్ సి పి పాలనలో, తెలుగుదేశం పాలనలో కాదు

ద్వారా: రోహిత్ గుత్తా

మార్చి 22 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు రద్దు చేసిన గ్రూప్-1 పరీక్షలు నిర్వహించింది వై ఎస్ ఆర్ సి పి పాలనలో, తెలుగుదేశం పాలనలో కాదు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు రద్దు చేసిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు తెలుగుదేశం హయాములో నిర్వహించారు అని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

మెయిన్స్ జవాబు పత్రాలు మూల్యాంకనంలో అవకతవకలు ఉన్నాయని హైకోర్టు ఈ పరీక్షని రద్దు చేసింది. మెయిన్స్ నిర్వహించింది 2021, 2022 సంవత్సరాలలో.

క్లైమ్ ఏంటి?

ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు మార్చ్ 13 నాడు 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష, పరీక్ష ఫలితాలని రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. ఈ నేపధ్యంలో సామాజిక మాధ్యమాలలో కొందరు ఈ తీర్పు చంద్రబాబుకి చెంపపెట్టు లాంటిది అని, ఎందుకంటే మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది తెలుగుదేశం హయాములో కాబట్టి అన్నట్టు అర్థం వచ్చే పోస్ట్స్ షేర్ చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం 2014-2019 మధ్య అధికారంలో ఉన్నది. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ  మరియు ఇక్కడ  చూడవచ్చు. 

తెలుగు దినపత్రిక సాక్షి కూడా ఇదే అర్థం వచ్చేటట్టు ఈ తీర్పు గురించి వార్తా కథనం ప్రచురించింది

వైరల్ సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంకొక కొన్ని వారాలలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిని ఎదుర్కోనున్నది.

మేము ఏమి తెలుసుకున్నాము?

హైకోర్టు తీర్పు ప్రతి ఒకటి మాకు లభించింది. అందులో 2018 గ్రూప్స్-1 పరీక్షకి సంబంధించిన వివిధ తారీఖులు, వివరాలు ఉన్నాయి. ఈ కింది వివరాలు ఈ తీర్పు నుండి సేకరించాము.

2018 గ్రూప్-1 పరీక్షకి నోటిఫికేషన్ డిసెంబర్ 31, 2018 నాడు ఇచ్చారు. అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది. ప్రిలిమ్స్ పరీక్ష మార్చ్ 10, 2019 నాడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. అయితే మే 2019లో ప్రభుత్వం మారి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రిలిమ్స్ పరీక్షలో 9,678 మంది అభ్యర్ధులు మెయిన్స్ కి అర్హత సాధించారు. మెయిన్స్ పరీక్షని డిసెంబర్ 14-20, 2021 మధ్య నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలని ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపిపిఎస్సీ) ఏప్రిల్ 28, 2021 నాడు విడుదల చేసింది. ఈ పరీక్షని నిర్వహించింది కూడా ఏపిపిఎస్సీ యే.

2021లో మెయిన్స్ ఫలితాలు వెల్లడించాక, కొంతమంది అభ్యర్ధులు జవాబు పత్రాల మూల్యాంకనం చట్టప్రకారం జరగలేదని ఆరోపిస్తూ హైకోర్టులో కేసు వేశారు. కోవిడ్ కారణంగా జవాబు పత్రాలని డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేశారు. అయితే చట్ట ప్రకారం మాన్యువల్ గానే చేయాలని ఈ అభ్యర్ధులు వాదించారు. హైకోర్టు వీరి వాదనలతో అంగీకరించి జవాబు పత్రాలని మాన్యువల్ గా పునర్మూల్యాంకనం  చేయమని అక్టోబర్ 1, 2021 నాడు తీర్పు ఇచ్చింది. 

ఇదిలా ఉండగా, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపిపిఎస్సీ బోర్డుని మార్చింది. అక్టోబర్ 2019లో కొత్త బోర్డుని ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 2022లో కొత్త ఛైర్మన్ ని కూడా నియమించింది.

మెయిన్స్ జవాబు పత్రాలని మాన్యువల్ గా పునర్మూల్యాంకనం చేసి వాటి ఫలితాలని మే 6, 2022 నాడు విడుదల చేశారు. అర్హత సాధించిన అభ్యర్ధులని ఇంటర్వ్యూకి పిలిచి తుది జాబితాని జులై 5, 2022 నాడు విడుదల చేశారు.

ఈ పరీక్ష గురించిన అన్ని నోటిఫికేషన్స్ కూడా ఏపిపిఎస్సీ వెబ్సైట్ లో ఉన్నాయి. అందులో ఉన్న తారీఖులు ఇక్కడ పేర్కొన్న వాటితో సరితూగాయి.

జూలై 2022లో తుది జాబితా విడుదల చేశాక, రెండవ మెయిన్స్ ఫలితాల జాబితాలో పేరు లేని 103 మంది అభ్యర్ధులు మళ్ళీ హైకోర్టులో కేసు వేశారు. పునర్మూల్యాంకనంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, కాబట్టి మెయిన్స్ పరీక్షనే రద్దు చేసి, పరీక్షని తిరిగి నిర్వహించాలని వాదించారు. కోర్టు వీరి వాదనలతో ఏకీభవించి, 2018 గ్రూప్స్-1 మెయిన్స్ పరీక్షని రద్దు చేసి, తిరిగి తాజాగా నిర్వహించాలని తీర్పునిచ్చింది.

మెయిన్స్ పరీక్ష, డిజిటల్ మూల్యాంకనం, మాన్యువల్ పునర్మూల్యాంకనం 2020, 2021, 2022లో జరిగాయి. ఇవన్నీ కూడా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న సంవత్సరాలు. 

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు మెయిన్స్ పరీక్షని రద్దు చేసిన కారణాలు (సౌజన్యం: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు/స్క్రీన్ షాట్)

గ్రూప్-1 పరీక్షలని 2017 లో తెలుగుదేశం హయాములో కూడా నిర్వహించారు. ఆ పరీక్షలు ఏవీ రద్దవలేదు. అలాగే ఎంపికైన అభ్యర్ధులు ఉద్యోగాలలో కూడా చేరిపోయారు.

దీని బట్టి హైకోర్టు రద్దు చేసిన గ్రూప్-1 పరీలక్షలు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాములో, కొత్త ఏపిపిఎస్సీ ఆధ్వర్యంలో జరిగాయి అని స్పష్టం అవుతున్నది.

తీర్పు

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాములో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. ఇవి తెలుగుదేశం హయాములో జరిగిన పరీక్షలు అని క్లైమ్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.

(అనువాదం- గుత్తా రోహిత్)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.