ద్వారా: రాజేశ్వరి పరస
ఏప్రిల్ 25 2024
ఒరిజినల్ ఫొటోలో జూనియర్ ఎన్ టి ఆర్ తెల్ల చొక్కా వేసుకుని ఉన్నారు. సైకిల్ చిహ్నాన్ని డిజిటల్ గా జోడించారు.
క్లైమ్ ఏంటి?
నటుడు జూనియర్ ఎన్ టి ఆర్ తెలుగుదేశం చిహ్నమైన సైకిల్ బొమ్మ ఉన్న షర్ట్ వేసుకున్నారంటూ ఒక ఫొటో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. ఈ ఫొటో షేర్ చేసి ఒక యూజర్ జూనియర్ ఎన్ టి ఆర్ తెలుగుదేశానికి మద్ధతు ప్రకటించారు అనే అర్థం వచ్చేలా రాసుకొచ్చారు. జూనియర్ ఎన్ టి ఆర్ తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు మనవడు.
“ఇది పేటీఏం గాళ్ళకి (వై ఎస్ ఆర్ కాంగ్రెస్ మద్ధతుదారులని ఉద్దేశించి). ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చేసింది. మన రక్తం.. మన బిడ్డ,” అని ఒక యూజర్ రాసుకొచ్చారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఆన్లైన్ లో చేసిన క్లైమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
అయితే ఇది డిజిటల్ గా ఎడిట్ చేసిన ఫొటో.
మేము ఏమి తెలుసుకున్నాము?
ఈ వైరల్ ఫొటో మీద ఫిల్మ్ ఫేర్ అనే వాటర్ మార్క్ ఉంది. ఫిల్మ్ ఫేర్ భారతదేశంలో పేరుపొందిన ఎంటర్టైన్మెంట్ పత్రిక. ఫిల్మ్ ఫేర్ వారి సామాజిక మాధ్యమ అకౌంట్లలో వెతికితే ఒరిజినల్ ఫొటోని ఏప్రిల్ 22 నాడు పోస్ట్ చేశారని తెలుసుకున్నాము (ఆర్కైవ్ ఇక్కడ).
ఫిల్మ్ ఫేర్ వెబ్సైట్ లో ఒక వ్యాసంలో కూడా ఈ ఫొటోలనే షేర్ చేశారని తెలుసుకున్నాము. “హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా చిత్రీకరణ కోసం ముంబై చేరుకున్న జూనియర్ ఎన్ టి ఆర్” అనేది ఈ వ్యాసం శీర్షిక. ఈ వ్యాసంలో వివిధ భంగిమలలో తీసిన ఇదే ఫొటోని జత చేశారు.
దీనిబట్టి ఒరిజినల్ ఫొటోలో సైకిల్ చిహ్నం జొప్పించి వైరల్ ఫొటో చేశారని మనకి అర్థం అవుతున్నది.
మే 2023లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక కథనం ప్రకారం 15 సంవత్సరాల క్రితం అంటే 2009లో జూనియర్ ఎన్ టి ఆర్ తెలుగుదేశానికి ప్రచారం చేశారు. అయితే ఆ తరువాత సినిమాల మీద దృష్టి పెట్టడానికి రాజకీయాల నుండి దూరం జరిగారు అని ఈ కథనంలో ఉంది.
మే 2023లో హైదరాబాద్ లో జరిగిన నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలకి తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్ టి ఆర్ ని ఆహ్వానించింది. ఇండియా టుడేలో వచ్చిన ఒక కథనం ప్రకారం, ‘ముందస్తు వ్యక్తిగత పనులు’ కారణంతో జూనియర్ ఎన్ టి ఆర్ ఈ కార్యక్రమానికి హాజరు అవ్వలేదు.
2024 ఎన్నికలలో జూనియర్ ఎన్ టి ఆర్ తెలుగుదేశానికి మద్ధతు తెలియచేశాడు అని తన నుండి ప్రకటన కానీ, వార్తా కథనాలు కానీ లేవు. ఒకవేళ ప్రకటించి ఉండుంటే కనుక అది జాతీయ స్థాయి వార్త అయ్యుండేది.
తీర్పు
సైకిల్ బొమ్మ చొక్కా జూనియర్ ఎన్ టి ఆర్ వేసుకోలేదు. వైరల్ ఫొటో డిజిటల్ గా ఎడిట్ చేసిన ఫొటో. కాబట్టి ఈ క్లైమ్ ఫేక్ అని మేము నిర్ధారించాము.
(అనువాదం- గుత్తా రోహిత్)