ద్వారా: రాజేశ్వరి పరస
మే 10 2024
బండి సంజయ్ పాత్రికేయలుతో మాట్లాడుతున్న ఆడియోని ఎడిట్ చేసి, ఎస్సీ, ఎస్టీ, ఓబిసి రిజర్వేషన్లను తాము తీసేస్తాము అని అన్నట్టుగా మార్చారు.
క్లెయిమ్ ఏమిటి ?
బిజేపి నాయకుడు మరియు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది, ఇందులో ఆయన మాట్లాడుతూ షెడ్యూలు కులాల వారికి, షెడ్యూల్ తెగలకు మరియు ఇతర వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్లను తీసేస్తాము అని అన్నట్టుగా ఉంది. దీనిని షేర్ చేస్తూ, ఈ వ్యాఖ్యలు ఎంపి బండి సంజయ్ ఒక అంతర్గత సమావేశంలో అన్నారని పేర్కొన్నారు. పైగా కొందరు యూజర్లు, బండి సంజయ్ తాను కుడా ఒక బి సి సామాజిక వర్గానికి చెందిన వాడై ఇలా చేయటం సరి కాదన్నారు. (బండి సంజయ్ ఓబిసి గా పరిగణించబడే మున్నూరు కాపు కులానికి చెందిన వ్యక్తి).
వైరల్ ఆడియోలో మనం బండి సంజయ్ ఫొటోతో పాటు, ఆయనదే అని పేర్కొంటున్న ఒక వాయిస్ ఓవర్ కుడా వినవచ్చు, ఇందులో ఆయన మాట్లాడుతూ, “ఏ రోజు కుడా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని, మాకు అంబేద్కర్ వలనే ఈ రాజ్యాంగబద్ద పదవులు వచ్చాయని, మేము ప్రధాన మంత్రులం అయ్యాం అని కానీ, ఎంపిలు అయ్యాం అని చెప్పి ఏ రోజు కుడా చెప్పుకోని పార్టీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం.
పైగా, “రిజర్వేషన్లను తీసుకువచ్చి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్ల విషయం ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన విషయం. గతంలో ఎస్సీ వర్గానికి సంబంధించి రిజర్వేషన్లు ఇస్తే, రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని అమిత్ షా గారు అన్నట్టు, ఎస్సీ, ఎస్టీ, ఓబిసి రిజర్వేషన్లను రద్దు చేస్తాం. క్లియర్ గా ఉంది కదా, స్పష్టంగా ఉంది కదా?”
సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కానీ లాజికల్లీ ఫ్యాక్ట్స్ కనుక్కున్నది ఏమిటంటే, బండి సంజయ్ వ్యాఖ్యలలో కొన్ని క్లిప్పులను కట్ చేసి, వేరే అర్ధం వచ్చేటట్టు తయారు చేశారని. .
వాస్తవం ఏమిటి ?
బండి సంజయ్ రిజర్వేషన్ల గురించి అలాంటి వ్యాఖ్యలు ఏమైనా చేశారా అని గూగుల్ లో మేము వెతికాము, కానీ అలాంటి కథనాలు ఏమీ మాకు లభించలేదు. ఒక వేళ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే అది జాతీయ మీడియాలో కుడా ప్రచురించబడేది.
కీ వర్డ్స్ తో వెతుకగా, జీ న్యూస్ తెలుగు అప్లోడ్ చేసిన ఒక వీడియోని మాకు లభించింది, ఇక్కడ సంజయ్ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు. (ఆర్కైవ్ ఇక్కడ). ఏప్రిల్ 28 నాడు అప్లోడ్ చేసిన ఈ వీడియోలో సంజయ్ తాను కరీంనగర్ లోని హుజురాబాద్లో ఉన్నానని, ఇంటింటి ప్రచారం చేస్తున్నానని తెలిపారు.
బండి సంజయ్ వైరల్ ఆడియోలో వాడిన పదాలే 24 నిమిషాల వ్యవధి గల ఈ ఇంటర్వ్యూలో మనం వినవచ్చు. ఈ ఇంటర్వ్యూ నుండి కొన్ని పదాలను తీసుకుని, వేరేగా అమర్చి మరోలా అర్ధం వచ్చే లాగా ఈ వీడియోని తయారు చేశారు.
ఈ వీడియో లో, 10:30 టైమ్ స్టాంప్ వద్ద, “ఇది ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన విషయం” అని, 10:38 వద్ద, “రిజర్వేషన్లను” అని మరియు 13:08 వద్ద, “మతపరమైన రిజర్వేషన్లను తీసుకువచ్చి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ” అని, 13:17 నుండి 13:31 నుండి, “ఏ రోజు కుడా కాంగ్రెస్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని, మాకు అంబేద్కర్ వలనే ఈ రాజ్యాంగబద్ద పదవులు వచ్చాయని, మేము ప్రధాన మంత్రులం అయ్యాం అని కానీ, ఎంపిలు అయ్యాం అని చెప్పి ఏ రోజు కుడా చెప్పుకొని పార్టీ.” ఇక్కడ కాంగ్రెస్ అనే పదాన్ని తీసేసి బిజేపీని జోడించారు.
మరియు 13:36 నుండి 13:38 మధ్య “భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం” పదాలు, మరియు 13:43 నుండి “గతంలో ఎస్సి వర్గానికి సంబంధించి రిజర్వేషన్లు విద్య మరియు ఇతర రంగాలలో” అని, 19:41 వద్ద, “మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేసి పేదలకు ఇస్తాము” అని, 19:51 వద్ద, “ ఎస్సీ, ఎస్టీ, ఓబిసి మరియు ఈబీసీ” అని 23:23 వద్ద “క్లియర్ గా ఉంది కదా, స్పష్టంగా ఉంది కదా” అని అన్నారు.
పైగా, కాంగ్రెస్, బిజేపి లాంటి కొన్ని పదాలను అక్కడక్కడ నుంచి తీసుకుని వైరల్ ఆడియోలో జోడించారు.
ఒరిజినల్ ఆడియోలో బండి సంజయ్ మతపరమైన రిజర్వేషన్లను తీసేసి పేద ప్రజలకు ఇస్తాము అని మాత్రమే అన్నారు. కానీ ఆయన ఎస్సీ, ఎస్టీ, ఓబిసి రిజర్వేషన్లను తీసేస్తాము అని అనలేదు. పైగా ఆ వీడియోలో ఆయన ఏమాత్రం సంకోచం లేకుండా రిజర్వేషన్లు అమలులో ఉంటాయి అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పదేళ్లుగా పాలనలో ఉంది, రిజర్వేషన్లను ఎక్కడ తీసివేసింది అని కుడా ప్రశ్నించారు.
టైమ్స్ అఫ్ ఇండియా మరియు ది న్యూ ఇండియన్ ఎక్సప్రెస్ కథనాలు కుడా బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రచురించాయి.
బండి సంజయ్ ఈ వ్యాఖ్యలని తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఏప్రిల్ 25 నాడు బిజేపి 2025 లోగా ఎస్సీ ఎస్టీ, ఓబిసి రిజర్వేషన్లను తీసేస్తుంది అని చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. ఇండియా టుడే కథనం ప్రకారం, రేవంత్ రెడ్డి బిజేపి ఎస్సీ, ఎస్టీ, ఓబిసి రిజర్వేషన్లను తీసేయడానికి 400 సీట్ల మద్దతు కోసం చూస్తుంది అని అన్నారు.
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి బిజేపి నాయకులు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కుడా స్పందిస్తూ, తాము రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న ముస్లిం రిజర్వేషన్లను మాత్రమే తీసివేస్తామని తెలుపుతూ, ఎస్సీ, ఎస్టీ, ఓబిసి రిజర్వేషన్లను తాము తొలగించము అని తెలిపారు, అని ది ఎకనామిక్ టైమ్స్ కథనంలో ఉంది.
తీర్పు :
బిజేపీ నాయకుడు బండి సంజయ్ పాత్రికేయలుతో మాట్లాడుతూన్న ఆడియోని ఎడిట్ చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబిసి రిజర్వేషన్లను తాము తీసేస్తాము అని అన్నట్టుగా షేర్ చేసారు. తను ఇటువంటి వాఖ్యలేమీ చేయలేదు. కనుక మేము దీనిని ఫేక్ అని నిర్ధారించాము.