ద్వారా: రోహిత్ గుత్తా
ఏప్రిల్ 1 2024
సర్వే నివేదికలోని సంఖ్యలని తెలుగుదేశానికి అనుకూలంగా ఎడిట్ చేశారు. ఇవి ఎడిటెడ్ ఫొటోలని సర్వే సంస్థ లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి స్పష్టం చేసింది.
క్లైమ్ ఏంటి?
శ్రీ ఆత్మ సాక్షి సంస్థ వారి ప్రీ పోల్ సర్వే ఫలితాలు అని చెబుతూ ఒక నివేదిక ఫొటోలని షేర్ చేసి, మే 13 నాడు జరగనున్న ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి గెలవనుందని ఈ సర్వేలో తేలిందని ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో క్లైమ్ చేశారు. కూటమికి 53.5 శాతం ఓట్లు, 175 లో 136 సీట్లు వస్తాయని సర్వేలో తేలిందని, ఆలాగే అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41.5 శాతం ఓట్లు, 21 సీట్లు రానున్నాయని, 18 సీట్లలో పోటా పోటీగా ఉండనుందని ఈ సర్వేలో తేలిందని ఈ పోస్ట్స్ లో ఉంది. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
వైరల్ సామాజిక పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
అయితే శ్రీ ఆత్మ సాక్షి విడుదల చేసిన ప్రీ పోల్ సర్వే నివేదికని ఎడిట్ చేసి ఇలా చేశారు. అసలైన నివేదికలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవనుందని ఉంది.
మేము ఏమి తెలుసుకున్నాము?
శ్రీ ఆత్మ సాక్షి సంస్థ మార్చ్ 23 నాడు విడుదల చేసిన సర్వే నివేదిక మాకు లభించింది. ఈ నివేదికలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48.5 శాతం ఓట్లతో 93 సీట్లు, కూటమికి 46.5 శాతం ఓట్లతో 50 సీట్లు రానున్నాయని, 32 సీట్లలో పోటా పోటీగా ఉందనుందని ఉంది.
శ్రీ ఆత్మ సాక్షి సంస్థ “మూడ్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఏస్ ఆన్ 23.03.2024” పేరు మీద విడుదల చేసిన సర్వే నివేదిక గురించిన వార్తా కథనాల కోసం వెతికాము. సాక్షి పోస్ట్, ఐ డ్రీమ్ లాంటి సంస్థలు రిపోర్ట్ చేసిన సంఖ్యలు ఈ నివేదికలోని సంఖ్యలతో సరితూగాయి.
పోటా పోటీగా ఉన్న 32 సీట్లలో 19 చోట్ల తెలుగుదేశం ముందంజలో ఉండగా, 13 చోట్ల వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని ఈ అసలయిన నివేదికలో ఉంది. 25 లోక్ సభ సీట్లలో వై ఎస్ ఆర్ సి పి 15 చోట్ల, కూటమి 5 చోట్ల గెలవనుందని, మిగతా 5 చోట్ల పోటా పోటీగా ఉండనుందని ఈ అసలైన నివేదికలో ఉంది.
వైరల్ ఫొటో, ఒరిజినల్ ఫొటో మధ్య తేడాలు (సౌజన్యం: ఎక్స్/శ్రీ ఆత్మసాక్షి)
అలాగే ఒరిజినల్ ఫొటోలతో పోలిస్తే వైరల్ ఫొటోలలో లొసుగులు ఉన్నాయి. ఇది 13 పుటల నివేదిక. వైరల్ పోస్ట్ లో 9 మరియు 10 పేజీలని కలిపివేసి ఒకే ఫొటోగా చేశారు. పేజీ 9 లో జిల్లా వారి వివరాలు, 10లో రాష్ట్ర వ్యాప్త సారాంశం ఉన్నాయి. ఇలా కలిపివేయటం కారణంగా కింద ఉన్న 9 పేజీ సంఖ్య స్థానభ్రంశం చెందింది.
వైరల్ ఫొటో, ఒరిజినల్ ఫొటో మధ్య పోలికలు (సౌజన్యం: ఎక్స్/శ్రీ ఆత్మసాక్షి)
మూడ్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ పేరు మీద శ్రీ ఆత్మ సాక్షి సంస్థ ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నది. ఈ మార్చి 23కి ముందు మార్చ్ 5 నాడు కూడా ఒక సర్వే నివేదికని విడుదల చేశారు. అందులో కూడా వై ఎస్ సి పి గెలవనుందని ఉంది.
ఈ విషయం గురించి శ్రీ ఆత్మ సాక్షి సంస్థని మేము సంప్రదించాము. తెలుగుదేశం విజయాన్ని చూపిస్తున్న నివేదిక అసలైన నివేదిక కాదని, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నదని ఉన్న నివేదికే అసలైనదని తెలుపుతూ వారు మాకు ఒక ఫొటో పంపించారు. ఈ సమస్త ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి ఆర్ మూర్తి వైరల్ ఫొటోలు ఎడిటెడ్ అని మాకు తెలిపారు.
శ్రీ ఆత్మ సాక్షి సంస్థ లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి పంపిన వివరణ (సౌజన్యం: శ్రీ ఆత్మ సాక్షి)
తీర్పు
శ్రీ ఆత్మ సాక్షి సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వే నివేదికని ఎడిట్ చేసి తెలుగుదేశం గెలవనుందని ఈ నివేదికలో తేలిందని క్లైమ్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ ఫేక్ అని మేము నిర్ధారించాము.
(అనువాదం- గుత్తా రోహిత్)