ద్వారా: ఉమ్మే కుల్సుం
ఫిబ్రవరి 27 2024
ఎన్నికల తేదీలకి సంబంధించి తాము ఎటువంటి తేదీలు ప్రకటించలేదని భారత దేశ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
క్లైమ్ ఏంటి?
భారత దేశంలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో ఎన్నికల తేదీలు, నామినేషన్, ఓట్ల లెక్కింపు తేదీలు, పార్టీల జయాపజయాల గురించి సామాజిక మాధ్యమాలలో జోరుగా చర్చ నడుస్తున్నది. ఈ నేపధ్యంలో “2024 సాధారణ ఎన్నికల వివరాలు” అనే పేరుతో ప్రభుత్వ ప్రకటన అని చెబుతూ ఒక ఫొటో వైరల్ అయ్యింది. ఈ ఫొటోలో పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ 19 నాడు జరగనున్నాయి, ఆలాగే ఫలితాలని మే 22 నాడు ప్రకటించనున్నారు అని ఉంది. ఎన్నికలకి సంబంధించిన ఇతర తేదీలు కూడా ఈ ఫొటోలో ఉన్నాయి. ఎన్నికల ప్రకటన మార్చ్ 23 నాడు ఇస్తారని కూడా ఇందులో ఉంది.
ఈ ఫొటో సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అయ్యింది. ఈ ఫ్యాక్ట్ చెక్ రాసే సమయానికి ఇటువంటి ఒక ఎక్స్ పోస్ట్ కి 3 లక్షలకి పైగా వ్యూస్ ఉన్నాయి. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
ఎన్నికల షెడ్యూల్ అని చెబుతూ ఆన్లైన్ లో షేర్ చేసిన ఫొటో స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
అయితే 2024 పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల అవ్వలేదు.
మేము ఏమి తెలుసుకున్నాము?
భారత దేశ ఎన్నికల సంఘం వారి వెబ్సైట్ లో 2024 పార్లమెంట్ ఎన్నికల గురించి ఏమైనా ప్రకటన/ఉత్తర్వు/పత్రికా ప్రకటన ఉందేమో అని చూశాము. అటువంటిది ఏదీ అక్కడ మాకు లభించలేదు. ఎన్నికల షెడ్యూల్ కనుక ప్రకటించి ఉంటే ఆ షెడ్యూల్ వివరాలని ఎన్నికల సంఘం వెబ్సైట్ లో పొందుపరిచేవారు. అలాగే ఈ షెడ్యూల్ ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు కూడా వెల్లడించేవారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో భారత ప్రభుత్వ అధికారిక సమాచార విభాగం. అలాగే భారత ప్రభుత్వానికి సంబంధించిన ఏ వెబ్సైట్ లోనూ ఎన్నికలకి సంబంధించిన వివరాలు లేవు. దీని బట్టి ఈ వైరల్ పోస్ట్ లో ఉన్నది తప్పుడు సమాచారం అని మనకి అర్థం అవుతున్నది.
అలాగే 2024 ఎన్నికల షెడ్యూల్ గురించి గూగుల్ లో వెతికితే నమ్మదగిన ఏ వార్తా సంస్థ ప్రచురించిన వార్తా కథనం మాకు లభించలేదు.
అదే కాక, భారత ఎన్నికల సంఘం ఈ వైరల్ క్లైమ్ గురించి తమ అధికారిక ఎక్స్ అకౌంట్ లో వివరణ ఇచ్చింది. ఎన్నికల షెడ్యూల్ పేరు మీద చలామణి అవుతున్న ఈ ఫొటో పూర్తిగా తప్పు అని ఎన్నికల సంఘం వారి ఈ ప్రకటన ద్వారా స్పష్టం అయ్యింది.
అలాగే ఎన్నికల తేదీలని ఎన్నికల సంఘం పత్రికా సమావేశంలో తెలియచేస్తుంది అని కూడా ఈ ప్రకటనలో ఉంది.
ఈ సంవత్సరం జనవరి నెలలో కూడా పార్లమెంటు ఎన్నికలకి తేదీలు ఖరారు అయ్యాయని, ఏప్రిల్ 16 నాడు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయని అంటూ ఒక ప్రకటన వైరల్ అయ్యింది. ఆ సమయంలో దిల్లీలోని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఇవి కేవలం తాత్కాలికంగా నిర్ణయించిన తేదీయే కానీ అధికారిక తేదీ కాదని స్పష్టం చేసింది. దానికి సంబంధించిన లాజికల్లీ ఫ్యాక్ట్స్ కథనాన్ని మీరు ఇక్కడ చదవచ్చు.
తీర్పు
2024 సాధారణ ఎన్నికలకి సంబంధించి భారత ఎన్నికల సంఘం అధికారిక తేదీలని ఇంకా ప్రకటించాల్సి ఉంది. కాబట్టి ఈ ఫొటో ఫేక్ అని మేము నిర్ధారించాము.
(అనువాదం- గుత్తా రోహిత్)