ద్వారా: రాహుల్ అధికారి
మార్చి 19 2024
సౌత్ ఫస్ట్ కానీ వే2న్యూస్ కానీ ఇటువంటి సర్వే నివేదిక ఏదీ ప్రచురించలేదు. వే2న్యూస్ వారి టెంప్లేట్ వాడి తయారు చేసిన ఫేక్ ఫొటో ఇది .
నేపధ్యం
2024లో కొన్ని రాష్ట్రాలలో జరగనున్న శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ని భారత ఎన్నికల సంఘం మార్చ్ 16 నాడు విడుదల చేసింది. లోక్ సభ ఎన్నికలతో పాటుగా ఇవి జరుగుతాయి. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు మే 13 నాడు జరగనున్నాయి. ఫలితాలు జూన్ 4 నాడు ప్రకటించనున్నారు.
క్లైమ్ ఏంటి?
ఈ నేపధ్యంలో వే2న్యూస్ సంస్థ తెలుగు కథనం అని చెబుతూ ఒక స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. ఈ కథనంలో పీపుల్స్ పల్స్ అనే సంస్థ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి నిర్వహించిన ప్రీ పోల్ ఫలితాలను సౌత్ ఫస్ట్ మీడియా సంస్థ విడుదల చేసింది అని ఉంది. ఈ ప్రీ పోల్ ప్రకారం ఈ ఎన్నికలలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవనుందని తేలిందని కథనంలో ఉంది.
మార్చ్ 11, 2024 నాడు వైరల్ అయిన ఈ పోస్ట్ ప్రకారం ఈ ఎన్నికలలో వై ఎస్ ఆర్ సి పి 121-134 సీట్లు గెలుచుకోనుంది. అలాగే తెలుగుదేశం 21-35 సీట్లు, జన సేన 2-5 సీట్లు, బిజెపి ఒక సీటు గెలుచుకోనున్నాయి. అలాగే వై ఎస్ ఆర్ సి పి కి 51 శాతం ఓట్లు, బిజెపికి 38 శాతం ఓట్లు రానున్నాయని ఇందులో ఉంది.
“మూడు పార్టీల పొత్తు వ్యవహారం వైసీపీకి కలిసి వచ్చిందని సౌత్ ఫస్ట్ జాతీయ సర్వే వెల్లడించింది. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 121-134 సీట్లు, కూటమికి 23-41 సీట్లు వస్తాయని అంచనా వేసింది. పొత్తుల వల్ల ప్రజల్లో జగన్ పై అభిమానం మరింత పెరిగిందని, గత నెలతో పోలిస్తే వైసీపీ గ్రాఫ్ లో 10 శాతం పెరుగుదల కనిపించిందని పేర్కొంది. ఈ ఎన్నికలు వన్ వర్సెస్ ఆల్ అన్నట్టుగా మారిందని తెలిపింది.”
ఈ ఫొటో ఫేస్బుక్, ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లాంటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. ఇటువంటి పోస్ట్స్ ఇక్కడ చూడవచ్చు.
వైరల్ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
అయితే ఈ క్లైమ్ తప్పు. సౌత్ ఫస్ట్ కానీ వే2న్యూస్ కానీ ఇటువంటి నివేదిక ఏదీ ప్రచురించలేదు.
మేము ఏమి తెలుసుకున్నాము?
ఈ వైరల్ ఫొటోని జాగ్రత్తగా గమనిస్తే అనేక లొసుగులు కనపడ్డాయి. ఈ ఫొటో శీర్షికలో సౌత్ ఫస్ట్ పేరు తప్పుగా ఉంది. ‘South First’ కి బదులు ‘South Frist’ అని ఉంది. సౌత్ ఫస్ట్ వారిదే ఇది అయ్యుంటే ప్రచురించే ముందే ఈ తప్పిదాన్ని వారు గుర్తించేవారు.
అలాగే, బిజేపీకి 38 శాతం ఓట్లు, ఒక సీటువస్తాయని ఇందులో ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీకి 4 శాతం ఓట్లతో 21-35 సీట్లు వస్తాయని ఉంది. ఇటువంటి ఓట్ల శాతం రాకూడదు అని లేదు కానీ, 38 శాతం ఓట్లు వచ్చిన పార్టీ కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకోవడం అనేది దాదాపుగా అసంభవం. ఈ లొసుగులు అన్నీ కూడా ఈ సర్వే నిజమేనా అనే అనుమానం కలిగించేలా ఉన్నాయి.
వైరల్ ఫొటోలో లొసుగులు (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
సౌత్ ఫస్ట్, వే2న్యూస్ సంస్థల ప్రకటనలు
పీపుల్స్ పల్స్ సంస్థతో కలిసి సౌత్ ఫస్ట్ గతంలో అనేక సర్వేలు నిర్వహించింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో వైసీపీ గెలవనుందని తెలుపుతూ సౌత్ ఫస్ట్ సర్వే విడుదల చేసినట్టు మాకు ఎక్కడా కనపడలేదు. ఇటువంటి సర్వే గురించి సౌత్ ఫస్ట్, పీపుల్స్ పల్స్ వెబ్సైట్ లలో కానీ, వారి సామాజిక మాధ్యమ అకౌంట్లలో కానీ ఎటువంటి సమాచారం లేదు.
దీని గురించి సౌత్ ఫస్ట్ తమ ఎక్స్ అకౌంట్ లో వివరణ ఇచ్చిన విషయాన్ని మేము గుర్తించాము. “ఆంధ్రకి సంబంధించి ఇప్పటివరకు సౌత్ ఫస్ట్, పీపుల్స్ పల్స్ ఎటువంటి ప్రీ పోల్ సర్వే నిర్వహించలేదు.” అని ఈ పోస్ట్ లో వారు పేర్కొన్నారు. పీపుల్స్ పల్స్ ఈ పోస్ట్ ని రీపోస్ట్ చేసింది.
అలాగే వే2న్యూస్ కూడా తమ ఎక్స్ అకౌంట్ లో “ఇది మా కథనం కాదు. మా లోగో వాడుకుని కొంతమంది #MetaGroups లో ఈ ఫొటోని షేర్ చేస్తున్నారు. ఈ కథనాన్ని మేము ప్రచురించలేదని మేము తెలియచేస్తున్నాము,” అని పోస్ట్ చేశారు.
వే2న్యూస్ టెంప్లేట్ వాడి షేర్ చేసిన తప్పుడు సమాచారంతో కూడిన అనేక క్లైమ్స్ ని లాజికల్లీ ఫ్యాక్ట్స్ డీబంక్ చేసింది.
తీర్పు
వే2 న్యూస్ టెంప్లేట్ వాడి రానున్న ఎన్నికలలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవనుందని సౌత్ ఫస్ట్- పీపుల్స్ పల్స్ సర్వేలో తేలిందని చెబుతూ ఒక ఫొటోని షేర్ చేశారు. అటువంటి సర్వే ఏమి జరగలేదు, వే2న్యూస్ ఇటువంటి కథనాన్ని ప్రచురించలేదూ. కాబట్టి ఈ క్లైమ్ ఫేక్ అని మేము నిర్ధారించాము.
(అనువాదం- గుత్తా రోహిత్)