ద్వారా: ఉమ్మే కుల్సుం
సెప్టెంబర్ 2 2024
పాకిస్థాన్ లోని కరాచీ లో బోట్ బేసిన్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన దొంగతనానికి సంబంధించిన వీడియో ఇది.
క్లెయిమ్ ఏమిటి?
సామాజిక మాధ్యమాలలో ముగ్గురు అబ్బాయిలు రైల్వే ట్రాక్ బోల్టులను తీసేస్తూ ఉన్న వీడియో ఒకటి షేర్ చేస్తూ, ఇది భారత దేశంలో జరిగినట్టుగా పేర్కొంటున్నారు. అనేక మంది యూజర్లు భారతీయ రైల్వే శాఖను ట్యాగ్ చేసి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
తరచూ తప్పుడు సమాచారాన్ని షేర్ చేసే న్యూస్ నెట్వర్క్ అయిన, సుదర్శన్ న్యూస్, ఎడిటర్ ఇన్ చీఫ్ సురేష్ చావహంకే కుడా ఈ వీడియోని షేర్ చేసారు. దీనికి హిందీ శీర్షికగా పెట్టి ఇలా రాసుకొచ్చారు, “ఇంత చిన్న వయసులోనే, రైల్వే ట్రాక్ లను తవ్వుతున్నారు అంటే, మరో 50 సంవత్సరాలలో ఎం చేయగలరో ఊహించండి. వీళ్ల గురించి డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ ఇచ్చిన హెచ్చరికలను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. కేవలం వారి పేరు తలుచుకున్నంత మాత్రాన ఏమి జరగదు. అయ్యా అశ్విని వైష్ణవ్, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్టు తెలిసిన వెంటనే, ఆర్ పి ఎఫ్ వారికి షూట్ చేయమని ఆదేశాలు ఇవ్వండి. అప్పుడే కొంత భయం ఉంటుంది.” (తెలుగు అనువాదం). పైగా అధికారులను, ఈ సంఘటన ఎక్కడ మరియు ఎప్పడు జరిగింది అనే విషయాలను కనుక్కోమని కుడా అడిగారు. ఆర్కైవ్ చేసిన పోస్టు ఇక్కడ.
తరచూ తప్పుడు సమాచారం షేర్ చేసే మనీష్ కశ్యప్ అనే ఒక బీహార్ కి చెందిన యూట్యూబర్ కుడా ఈ వీడియోని షేర్ చేసి ఇది భారత దేశం లో జరిగింది అని పేర్కొన్నారు. ఆ వీడియోలో ఆ బాలుడు ధరించిన దుస్తులను ఆధారం చేసుకుని, ముస్లిం మతస్థులని టార్గెట్ చేస్తూ, రైల్వే ట్రాక్ వద్ద ముస్లింల గురించి భారతీయ రైల్వే శాఖకు ఫిర్యాదు చేసాడు. ఆర్కైవ్ చేసిన పోస్టు ఇక్కడ.
కానీ ఈ క్లెయిమ్స్ తప్పు, ఎందుకంటే, ఇది పాకిస్థాన్ కి చెందిన వీడియో, భారత దేశానికీ సంబంధం లేదు.
మేము ఏమి కనుగొన్నము?
లాజికల్లీ ఫ్యాక్ట్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ‘పాకిస్థానీ ట్రైన్స్’ అనే ఒక ఫేస్బుక్ అకౌంట్, డిసెంబర్ 5, 2023 నాడు షేర్ చేసిన వీడియో ఒకటి లభించింది (ఆర్కైవ్ ఇక్కడ). ఈ పోస్టు ప్రకారం, ఈ సంఘటన పాకిస్థాన్ లోని కరాచీ లో బోట్ బేసిన్ పోలీస్ స్టేషన్ లో సర్తాజ్ ఖాన్ ఫాథక్ రైల్వే లైన్ వద్ద చోటు చేసుకుంది. ఆ వీడియోని షేర్ చేసి, అక్కడ ఉండే అధికారులను చర్యలు తీసుకోమంటూ కోరారు.
ఇంకాస్త పరిశోధన చేయగా, డిసెంబర్ 2023 లో షేర్ చేసిన మరిన్ని ఎక్స్ పోస్టులు లభించాయి (వాటి ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ మరియు ఇక్కడ), ఆ పోస్టులు కుడా ఇది పాకిస్థాన్ కి చెందిన ఘటన గానే చెప్పుకొచ్చాయి. పైగా డిసెంబర్ 6, 2023 నాడు షేర్ చేసిన ఒక యూట్యూబ్ వీడియో లభించింది, ఇందులో ముగ్గురు అబ్బాయిల ఫొటోని చూపుతూ, మీడియా సెల్ డి ఐ జి సౌత్ కరాచీ పోలీస్ మాటల్ని కామెంటరీ గా జత చేశారు, (ఆర్కైవ్ చేసిన వీడియో ఇక్కడ), ఇందులో ఆ వీడియో వైరల్ అయిన తరువాత పోలీసులు తీసుకున్న చర్యల గురించి వివరణ ఉంది.
కరాచీ లోని సౌత్ జోన్ పోలీస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫిసిఅల్ అకౌంట్ కుడా ఇదే సమాచారాన్ని నిర్ధారించింది. ఆ వీడియో లో ఇది కరాచీ లోని సర్తాజ్ ఖాన్ ఫాథక్ రైల్వే లైన్ వద్ద చోటు చేసుకుంది అని తెలియజేసారు. డి ఐ జి సౌత్ ఉత్తర్వుల మేరకు, బోట్ బేసిన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ, ఇందులో భాగస్వామ్యం అయిన పిల్లలను పట్టుకున్నారు. ఆ తరువాత వాళ్ళ తల్లి దండ్రులను హెచ్చరించి, ఇక పై గమనిస్తూ ఉంటామని చెప్పి వదిలేశారు.
ఈ వీడియోలో, ఒక పోలీస్ ఆఫీసర్ ఆ ముగ్గురు బాలులను ప్రశ్నించగా, అందులో ఒకరు, షెరీన్ జిన్నాహ్ కాలనీలో రైల్వే ట్రాక్ వద్ద నట్టులను మరియు బోల్టులను దొంగలించినట్టుగా ఒప్పుకున్నారు. ఆ ఆఫీసర్, అక్కడే ఉన్న తండ్రిని ఇకపై ఇలాంటి విషయాలు జరగకుండా చుస్కోవలసిందిగా కుడా మందలించినట్టు చూడవచ్చు.
కరాచీ పోలీస్ షేర్ చేసిన యూట్యూబ్ వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం : యూట్యూబ్)
కరాచీ పోలీసులు యూట్యూబ్ లో పెట్టిన వీడియోని తీక్షణంగా పరీక్షించిన తరువాత, అందులో 7 సెకెన్ల మార్క్ వద్ద, రైల్వే ట్రాక్ పక్కన ఉన్న గోడ మీద ఒక ఫోన్ నెంబర్ రాసి ఉండటం గమనించాము. ఇందులో 0301 అనేది మొబిలింక్ అనే పాకిస్థాన్ కి చెందిన ఒక సర్వీస్ ప్రొవైడర్ కోడ్, దీని బట్టి ఇది పాకిస్థాన్ కి చెందినది అని నిర్ధారించాము.
తీర్పు
ముగ్గురు అబ్బాయిలు పాకిస్థాన్ లోని కరాచీ లో రైల్వే ట్రాక్ వద్ద ఉన్న వీడియోని తప్పుగా ఇది ఇండియాకి చెందినదిగా షేర్ చేశారు.
(అనువాదం : రాజేశ్వరి పరసా)