హోమ్ 2018 నాటి వీడియో షేర్ చేసి తెలంగాణ ఎన్నికలకి ముందే కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందని క్లైమ్ చేశారు

2018 నాటి వీడియో షేర్ చేసి తెలంగాణ ఎన్నికలకి ముందే కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందని క్లైమ్ చేశారు

ద్వారా: రజిని కె జి

నవంబర్ 29 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
2018 నాటి వీడియో షేర్ చేసి తెలంగాణ ఎన్నికలకి ముందే కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందని క్లైమ్ చేశారు వైరల్ వీడియో షేర్ చేసిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

అబద్ధం

2018 ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి తరువాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్న వీడియో ఇది.

నేపధ్యం

తెలంగాణ శాసనసభ ఎన్నికలు నవంబర్ 30, 2023, నాడు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 3 నాడు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో సర్కులేట్ అవుతున్నది. ఎన్నికలకి ముందే కాంగ్రెస్ బీఅర్ఎస్ చేతిలో తమ ఓటమిని ఒప్పుకుంది అంటూ క్లైమ్ చేశారు.

ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో ఒకరు నవంబర్ 25, 2023, నాడు ఈ వీడియో షేర్ చేసి, “పులి బిడ్డ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఓటమిని ఒప్పేసుకున్నాడు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ తోనే ఉన్నారని పులి బిడ్డ చెప్పేశాడు,” అనే శీర్షిక రాసుకొచ్చారు.

ఈ వీడియోలో రేవంత్ రెడ్డి, “ప్రాధమికంగా అందుతున్న సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రజలు టిఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఫలితాలు ఎట్లున్నా కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యల మీద బాధ్యతాయుతంగా పోరాటం చేస్తాం”, అని చెప్పడం మనం వినవచ్చు. ఈ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ  చూడవచ్చు. 

వైరల్ వీడియో స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉంది. ఇది 2018 నాటి వీడియో.

వాస్తవాలు

ఈ వీడియో కీఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే మరింత నిడివి ఉన్న ఇదే వీడియో మాకు లభించింది. ఈ వీడియోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డిసెంబర్ 11, 2018 నాడు తమ యూట్యూబ్ చానల్ లో అప్లోడ్ చేశారు. “ఎన్నికల ఫలితాల తరువాత మీడియాతో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి,” అనేది ఈ వీడియో శీర్షిక. వైరల్ వీడియో ఈ వీడియోలో 1:21 టైమ్ స్టాంప్ నుండి మొదలవుతుంది. ఇందులో రేవంత్ 2018 నాటి ఎన్నికల ఓటమి గురించి మాట్లాడారు.

వి 6 న్యూస్ తెలుగు కూడా ఇదే వీడియోని తమ యూట్యూబ్ చానల్ లో డిసెంబర్ 11, 2018 నాడు అప్లోడ్ చేశారు. ఇందులో కూడా వైరల్ క్లిప్ 1:21 టైమ్ స్టాంప్ నుండి చూడవచ్చు. యోయో టీవీ చానల్ అనే తెలుగు యూట్యూబ్ చానల్ కూడా ఈ వీడియోని అప్లోడ్ చేశారు. 

2018 తెలంగాణ ఎన్నికలు 

2018లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు డిసెంబర్ 7 నాడు జరిగాయి. ఫలితాలు డిసెంబర్ 11 నాడు వెలువడ్డాయి. 119 సీట్లలో టిఆర్ఎస్ 88 సీట్లు గెలుచుకుంది. కొడంగల్ నుండి పోటీ చేసిన రేవంత్ టిఆర్ఎస్ అభ్యర్ధి నరేందర్రెడ్డి చేతిలో 10000 ఓట్లతో ఓడిపోయారు. 

తీర్పు 

2018లో కాంగ్రెస్ ఓటమి, తన ఓటమి తరువాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్న వీడియోని షేర్ చేసి 2023 ఎన్నికలకి ముందే కాంగ్రెస్ ఓటమిని ఒప్పుకుందని క్లైమ్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.