ద్వారా: రజిని కె జి
ఆగస్టు 27 2024
వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది తెలంగాణ లోని దేవనూర్ గ్రామంలో బి సి మరియు ఎస్ సి వ్యక్తులకు సంభందించిన గొడవ.
క్లెయిమ్ ఏమిటి?
సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇందులో కాషాయ రంగు కండువా కప్పుకుని ఉన్న వ్యక్తులు మరో ఇద్దరు వ్యక్తులపై దాడి చేస్తుండగా, పోలీసులు అడ్డుకుంటున్నట్టు కనిపిస్తుంది. కొంత మంది ఈ వీడియోని షేర్ చేసి, ఇది తమిళ్ నాడు లో ఒక ముస్లిం వ్యక్తి చ్ఛత్రపతి శివాజీ గురించి అసభ్యకార వ్యాఖ్యలు చేయటం తో హిందూ వ్యక్తులు అతని పై దాడి చేశారు అనే క్లెయిమ్ తో షేర్ చేస్తున్నారు. చ్ఛత్రపతి శివాజీ భారత దేశం లో 17 వ శతాబ్దం లో మరాఠా రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి.
ఇదే వీడియోని ఎక్స్ లో షేర్ చేస్తూ, ఛత్రపతి శివాజీ పై అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ‘జిహాదీ’ అంటూ, అతను తెలంగాణ లోని పోలీస్ స్టేషన్ లో పట్టుబడితే, హిందువులు అతనిని బయటకి లాగి కొట్టినట్టుగా రాసుకొచ్చారు. జిహాదీ అనేది, ముస్లిం లను కించపరుస్తూ వాడే ఒక పదం. ఆ పోస్టుకు ఈ కథనం రాసే సమయానికి 511,400 వ్యూస్, 15,000 లైక్స్, మరియు 3,100 రీపోస్ట్స్ ఉన్నాయి. అలాంటి ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కానీ వీడియోలో జరిగిన గొడవ 2023లో తెలంగాణకు సంభందించినది, ఇక్కడ వెనుకబడిన వర్గాలు మరియు షెడ్యూల్డ్ వర్గాలకు మధ్య గొడవ జరిగింది. ఇక్కడ మతకోణం ఏమి లేదు.
వాస్తవం ఏమిటి?
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఫిబ్రవరి 2 2023 నాడు ది న్యూస్ మినిట్ కథనం ఒకటి లభించింది, ఇందులో వైరల్ వీడియో మాదిరి ఫొటోలే కొన్ని ఉన్నాయి. ఈ కథనం ప్రకారం, జనవరి 31, 2023 నాడు, ఒక గుంపు మెట్లి నరేష్ మరియు మరో వ్యక్తి పై చెప్పులు, రాళ్లు, కుండలు వంటి వాటితో యాలాల్ పోలీస్ స్టేషన్ వద్ద దాడి చేసారు. నరేష్ అనే ఇతను యాలాల్ మండల్ లోని దేవనూర్ గ్రామం లో దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.
ఈ సంఘటనలో ముగ్గురు పోలీసులు ఈ ఇద్దరినీ ఆ గుంపు నుండి కాపాడే ప్రయత్నం చేశారు.
ఈ గొడవకు ముందు రోజు, అంటే జనవరి 30, 2023 నాడు, నరేష్ మరియు శ్రీనివాస్ అనే వ్యక్తులు వాదించుకుంటుండగా, శివ మాల ధరించిన నరేంద్రర్ అనే ఒక బి సి వర్గానికి చెందిన వ్యక్తి ఈ గొడవను ఆపడానికి ప్రయత్నించాడు (హిందూ దేవుడైన శివుడికి సంభందించిన మాల, శివ మాల). ఈ వాగ్వాదం లో నరేష్ నరేందర్ ని మధ్యలోకి రావొద్దని, పక్కకి తోసాడు.
ఆ తరువాత నరేష్ శివ మాలను అవామానించాడు అని నరేందర్ యాలాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. ఆ తరువాత రోజు, నరేష్ ని దాదాపుగా ఒక 100 మంది వ్యక్తులు శివ మాల ధరించిన వ్యక్తులు గుంపుగా వచ్చి దాడి చేసారు, దీనిలో భాగంగానే, నరేష్ అనికుని మరో వ్యక్తిని కుడా గాయపరిచారు.
2023 నాటి ది న్యూస్ మినిట్ కథనం (సౌజన్యం : ది న్యూస్ మినిట్)
ఒక సౌత్ ఫస్ట్ కథనం ప్రకారం, ఆ గ్రామంలో అంబెడ్కర్ విగ్రహం పెట్టిన తరువాత గొడవ పెద్దదైందని పేర్కొంది. వెనుకబడిన వర్గానికి చెందిన వారు విగ్రహ ఆవిష్కరణకు ఆటంకం తెలియజేసారు. ఇరు వర్గాల మధ్య అస్సమ్మతి, గొడవకు దారి తీసింది. ఇందులో నరేష్ అనే వ్యక్తి కుడా ఉన్నాడు. కులం పేరు మీద అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఎనిమిది మంది మీద నరేష్ ఫిర్యాదు నమోదు చేసాడు. మరో బిబిసి గ్రౌండ్ రిపోర్ట్ కుడా ఈ విషయాన్నే పేర్కొంది.
లాజికల్లీ ఫ్యాక్ట్స్ నరేష్ మరియు నరేందర్, ఇద్దరు నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ కాపీలను కనుగొనింది. జనవరి 31 నాడు నమోదు అయిన ఎఫ్ ఐ ఆర్ ప్రకారం, శివ మాలా వేసుకున్న వ్యక్తిని అవమాననించటం వలన ఎస్ సి మరియు బిసి వర్గాలకు మధ్య ఈ గొడవ జరిగింది అని ఉంది.
ఎఫ్ ఐ ఆర్ కాపీ స్క్రీన్ షాట్ (సౌజన్యం : యలాల్ పోలీస్ స్టేషన్)
ఈ విషయం లో రెండవ ఎఫ్ ఐ ఆర్ జనవరి 31, 2023 నాడు నరేష్ అనే వ్యక్తి ఫైల్ చేసాడు. ఈ ఎఫ్ ఐ ఆర్ లో నరేందర్ మరియు ఇతరులు అసభ్య వ్యాఖ్యలు చేసి నరేష్ కులాన్ని అవమానించి నట్టుగా ఉంది. ఈ కేసును, షెడ్యూల్డ్ కులం వ్యక్తి పైన ఇతర వర్గం వారు దాడి చేసినట్టుగా నమోదు చేశారు. ఇక్కడ ముస్లిం వర్గానికి సంబంధించి ఏమి తెలియజేయలేదు.
ఎఫ్ ఐ ఆర్ కాపీ స్క్రీన్ షాట్ (సౌజన్యం : యాలాల్ పోలీస్ స్టేషన్)
లాజికల్లీ ఫ్యాక్ట్స్ తాండూర్ కి చెందిన డి ఎస్ పి బాలకృష్ణ రెడ్డిని సంప్రదించింది. ఆయన మాతో మాట్లాడుతూ, ఈ సంఘటన దేవనూర్ గ్రామం లో జరిగింది అని నిర్ధారించారు. “ఇక్కడ మతపరమైన కోణం ఏమి లేదు. ఇద్దరు కుల వర్గాల మధ్య జరిగిన గొడవ. బి సి వర్గానికి చెందిన వ్యక్తులు ఎస్ సి వర్గానికి చెందిన ఒక వ్యక్తి పై దాడి చేశారు. ఈ విషయమై కేసు కుడా నమోదు చేయబడింది.”
తీర్పు
2023 లో వెనుకబడిన వర్గాలు మరియు షెడ్యూల్డ్ కులాలకు మధ్య జరిగిన గొడవని, తప్పుగా మతరంగు పులిమి షేర్ చేస్తున్నారు. పోలీసులు ఈ సంఘటనకు మతకోణం లేదని నిర్ధారించారు.
(అనువాదం: రాజేశ్వరి పరసా)