ద్వారా: రాహుల్ అధికారి
సెప్టెంబర్ 25 2024
పాకిస్థాన్ కి చెందిన ఏ ఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను తప్పుగా తిరుమల తిరుపతి వివాదానికి జత చేస్తూ షేర్ చేసారు.
క్లెయిమ్ ఏమిటి?
తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం జరిగింది అనే ఆరోపణల నేపధ్యంలో సామాజిక మాధ్యమాలలో ఒక ఫొటో వైరల్ అవుతుంది. ఇందులో ఒక సంస్థలో పని చేసే ముస్లింల జాబితాని చూపుతూ, తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన సంస్థ ఇది అని ఇందులో ముస్లింలకు భాగం ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు.
ఒక ఎక్స్ యూసర్ (పూర్వపు ట్విట్టర్) పోస్ట్ చేస్తూ, “తిరుపతి బాలాజీ ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన తమిళ్ నాడు కి చెందిన సంస్థలో పని చేస్తున్న ఉన్నత నిర్వాహకుల పేర్లు ఇవి” అని రాసుకొచ్చారు. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కానీ ఈ వైరల్ ఫొటోలో చూపిస్తున్నది పాకిస్థాన్ సంస్థ ఏ ఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు, తిరుపతి కి నెయ్యి సరఫరా చేసిన ఏ ఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కాదు. ఈ రెండు కంపెనీ పేర్లు ఒకేలా ఉండటం వలన తికమక మొదలయ్యింది.
వాస్తవం ఏమిటి?
మా పరిశోధన ప్రకారం వైరల్ అవుతున్న ఫొటోలో ఉన్నది ఏ ఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ. కానీ తిరుమల లో కల్తీ నెయ్యి సరఫరా చేసింది అనే ఆరోపణలు ఉన్న సంస్థ తమిళ్ నాడు కి చెందిన ఏ ఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రెండు పేర్లు కాస్త ఒకే మాదిరిగానే ఉన్నా కుడా ఈ రెండు వేర్వేరు సంస్థలు. ఏ ఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది పాకిస్థాన్ కి చెందిన ఒక మసాలాల సంస్థ, దీనిని 1970 లో స్థాపించారు. పైగా ఏ ఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది పాల ఉత్పత్తులకు సంభందించిన భారతీయ సంస్థ, దీనిని 1995 లో స్థాపించాపారు.
పాకిస్తానీ కంపెనీ ఏ ఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్
ఈ సంస్థ ఫూల్ అనే బ్రాండ్ పేరుతో మసాలాలు అమ్ముతుంది. దీనికి సంభంధించిన వివరాలు వారి అధికారిక వెబ్సైటు అయిన arfoods.com.pk లో చూడవచ్చు. ఇందులో .pk అనేది, ఈ వెబ్సైటు పాకిస్థాన్ లో నమోదు అయినట్టుగా మనకి తెలియజేస్తుంది.
పైగా ఈ కంపెనీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ను గమనిస్తే, ఇది పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ కు చెందినది గా అర్ధమవుతుంది. వైరల్ ఫొటోలో కనిపించే అయిదుగురి ఉద్యోగుల ప్రొఫైల్ ను మేము కంపెనీ లింక్డ్ ఇన్ పేజీ ద్వారా చూసాము. ఇందులో నలుగురి ఫొటోలు పేర్లు ఉద్యోగ ప్రొఫైల్ సరితూగింది. మరో వ్యక్తి అయిన లియోనిడాస్ షేక్ వివరాలు, ఆయన ప్రొఫైల్ కి ప్రైవసీ సెట్టింగ్స్ ఉండటం వలన చూడలేదు. కానీ మరో వేదికను వాడి చెక్ చేయగా అతను ఏ ఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వేర్ హౌస్ ఆపరేషన్స్ మేనేజర్ గా పని చేస్తారు అని తెలిసింది, ఇదే విషయం వైరల్ స్క్రీన్ షాట్ లో కుడా ఉంది. దీని బట్టి ఉద్యోగుల ఫొటోలను వారి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ నుండి తీసుకున్నట్టు తెలుస్తుంది. పైగా, వైరల్ ఫొటోలోని, ఒరిజినల్ ఫొటోలోని రెండింటిలో వారి లొకేషన్ పాకిస్థాన్ అని పేర్కొని ఉంది.
వైరల్ ఫొటోకి మరియు లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్ కి మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
భారతీయ కంపెనీ ఏ ఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్
ఇది తమిళ్ నాడు కి చెందిన ఒక పాల ఉత్పత్తులు తాయారు చేసే సంస్థ, ఇది రాజ్ మిల్క్ బ్రాండ్ పేరుతో కొనసాగుతుంది. ఈ సంస్థ డైరెక్టర్ల పేర్లు రాజశేఖరన్ సూర్య ప్రభ, రాజు రాజశేఖరన్ మరియు శ్రీనివాసుల నాయుడు, రామచంద్రన్ శ్రీనివాసన్ అని పేర్కొని ఉంది. ఈ కంపెనీని తమిళనాడు లోని డిండిగిల్ లో నమోదు చేసారు, ఈ సంస్థ లొకేషన్ ని మనం గూగుల్ మ్యాప్స్ లో కుడా చూడవచ్చు.
ఈ సంస్థ తమ ఉత్పత్తులలో జంతు కొవ్వు కలిసింది అనే ఆరోపణను కండించింది. ది హిందూ కథనం ప్రకారం, టీటీడీ వారు ఏ ఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఇకపై నెయ్యి సరఫరా చెయ్యకుండా బ్లాక్ లిస్ట్ చేసింది అని తెలిపింది. పైగా ఆ కంపెనీ షో కాజ్ నోటీసు సరైన స్పందన ఇవ్వకపోతే, ఆ సంస్థ పై చట్ట ప్రకారం టీటీడీ ముందుకు వెళ్తుంది అని కథనం పేర్కొంది.
ఈ విషయమై లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఏ ఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను కుడా సంప్రదించింది, స్పందన వచ్చిన వెంటనే ఇక్కడ పొందుపరుస్తాము.
తిరుపతి లడ్డు ప్రసాద వివాదం
తిరుపతి లడ్డు ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన కల్తీ నెయ్యిని వాడినట్టుగా ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైఎసార్సీపి ప్రభుత్వం పై ఆరోపణలు కురిపించారు.
ఈ ఆరోపణల ప్రకారం, లడ్డు తయారీ కోసం వాడిన నెయ్యిలో బీఫ్ టాలో, పంది కొవ్వు మరియి చేప నూనె కలిసినట్టుగా పేర్కొన్నారు. పైగా నాయుడు ప్రభుత్వం, గుజరాత్ లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారి చే ద్రువీకరించ బడిన ఒక లాబ్ రిపోర్ట్ ను కుడా విడుదల చేసింది. వీటి ప్రకారం, నెయ్యి నమూనాలో జంతు కొవ్వు ఉంది.
తీర్పు
పాకిస్థాన్ కి చెందిన ఒక మసాలాలు ఉత్పత్తి చేసే సంస్థను తిరుమల తిరుపతి లడ్డు తయారీకి నెయ్యి సరఫరా చేసిన సంస్థలాగా షేర్ చేసారు. ఈ రెండు సంస్థల పేర్లు ఒకేలా ఉన్న, ఏ ఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది, పాకిస్థాన్ కి చెందిన సంస్థ, ఏ ఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది భారత దేశానికీ చెందిన సంస్థ, దీనిపై కల్తీ నెయ్యి సరఫరా అభియోగం ఉంది.
(అనువాదం : రాజేశ్వరి పరసా)