ద్వారా: ఇషిత గోయల్ జె
మే 24 2024
2023 నాటి ఒరిజినల్ వీడియోలో తమ పిల్లల సంక్షేమం కోసం బీజేపీకి ఓటు వేయమని కార్యకర్తలకి తెలిపారు.
క్లైమ్ ఏంటి?
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిస్తున్నట్టున్న వీడియో క్లిప్ ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. ఈ 7 సెకన్ల క్లిప్ లో మోదీ ఒక బహిరంగ సభలో, “మీ కుటుంబంలో పిల్లల మంచి కోరుకునేవారైతే.. కాంగ్రెస్ కి ఓటు వేయండి,” అని హిందీలో చెప్పడం మనం చూడవచ్చు. ఈ వీడియో మీద “కాంగ్రెస్ కి ఓటు వేయండి” అని టెక్స్ట్ఆంగ్లం లో ఉంది.
ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోని షేర్ చేసి, “మీ కుటుంబంలో పిల్లలకి మంచి చేయాలంటే, కాంగ్రెస్ కి ఓటు వేయమని స్వయానా మోదీజీనే చెబుతున్నారు,” అని హిందీలో శీర్షిక రాసుకొచ్చారు. అలాగే, “మంచి విద్య, ఉద్యోగం, భారతదేశం అభివృద్ధి కోసం ✋కాంగ్రెస్ కి ఓటు వేయమని మోదీ చెబుతున్నారు,” అనే శీర్షికతో ఇంకొక యూజర్ ఈ వీడియోని షేర్ చేశారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
వైరల్ సామాజిక మాధ్యమ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
వాస్తవాలు ఏమిటి?
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఒరిజినల్ వీడియో మాకు లభించింది. ఈ వీడియోని యూట్యూబ్ లో మోదీ అధికారిక అకౌంట్ లో జూన్ 27, 2023 నాడు అప్లోడ్ (ఆర్కైవ్ ఇక్కడ) చేశారు. రెండున్నర్ర నిమిషాలకి పైగా ఉన్న ఈ వీడియోకి “మీ కొడుకు, కూతుళ్ళ బాగు కోసం బీజేపీకి ఓటు వేయండి#MeraBoothSabseMajboot (అన్నీ బూత్ లలో కల్లా నా బూత్ బలమైనది) ” అనే శీర్షిక హిందీలో పెట్టారు. మోదీ జనాలకి ఓటు వేయమని చెప్పింది కాంగ్రెస్ కి కాదని, బీజేపేకి అని ఈ శీర్షిక ద్వారానే చెప్పేయొచ్చు.
వైరల్ క్లిప్ లో మొదటి భాగం, “మీ కుటుంబంలో పిల్లల మంచి కోరుకునేవారైతే” అనేది ఒరిజినల్ వీడియోలో 2:33 దగ్గర మొదలవుతుంది. దీనికి కొనసాగింపుగా మోదీ “బీజీపీకి ఓటు వేయండి” అని అనటం మనం ఈ ఒరిజినల్ వీడియోలో చూడవచ్చు. ఇక్కడ ఎక్కడా కాంగ్రెస్ ప్రస్తావనే లేదు.
“భోపాల్ లో MeraBoothSabseMajboot గురించి ప్రధాని మోదీ బహిరంగ సభలో ప్రసంగించారు. బీజేపీని ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా చేయడంలో మధ్య ప్రదేశ్ పాత్రని మోదీ గుర్తించారు” అని ఈ వీడియో వివరాలలో ఉంది. నవంబర్, 2023లో మధ్య ప్రదేశ్ లో జరిగిన శాసనసభ ఎన్నికలకి ముందు మోదీ బీజేపీ కార్యకర్తలని ఉద్దేశించి ప్రసంగించిన సభ ఇది.
ఈ సభ మొత్తం వీడియోని యూట్యూబ్ లో నరేంద్ర మోదీ అధికారిక అకౌంట్ లో జూన్ 23 నాడు అప్లోడ్ (ఆర్కైవ్ ఇక్కడ) చేశారు. ఈ వీడియో రెండున్నర్ర గంటలకి పైగా ఉంది. ఇందులో మోదీ బీజేపీకి ఓటు వేయమని చెబుతున్న భాగం 2:02:50 టైమ్ స్టాంప్ దగ్గర ఉంది.
వైరల్ వీడియోని ఎలా తయారు చేశారు?
రెండున్నర్ర గంటల నిడివి ఉన్న వీడియోలో మోదీ వివిధ ప్రతిపక్ష నాయకుల పేర్లు తీసుకుని, ఆయా నాయకుల కుటుంబాలు బాగుండాలంటే, ఆయా నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకి ఓటు వేయమని చెప్పటం మనం వినవచ్చు. 2:01:03 టైమ్ స్టాంప్ దగ్గర మోదీ, “గాంధీ కుటుంబం పిల్లలు మంచిగా ఉండాలని అనుకుంటే, కాంగ్రెస్ కి ఓటు వేయండి,” అని హిందీలో చెప్పటం మనం వినవచ్చు. సోనియా, రాహుల్ గాంధీలని ఉద్దేశించే తను ఈ మాటలు అన్నారు.
ఇక్కడ “కాంగ్రెస్ కి ఓటు వేయండి” అనే భాగాన్ని తీసుకుని, మీ కుటుంబంలో పిల్లల మంచి కోరుకునేవారైతే” అనే భాగానికి జోడించారు. అయితే, వీడియోలో మోదీ చాలా స్పష్టంగా పిల్లల మంచి కోసం బీజేపీకి ఓటు వేయమని తెలిపారు.
న్యూస్ 18 కూడా ఈ సభ వీడియోని తమ ఎక్స్ అకౌంట్ లో జూన్ 27 నాడు పోస్ట్ (ఆర్కైవ్ ఇక్కడ) చేసింది. “గాంధీ కుటుంబంలో పిల్లల అభివృద్ధి కావాలంటే, కాంగ్రెస్ కి ఓటు వేయండి. ములాయం పిల్లల అభివృద్ధి కోసం ఎస్ పి కి ఓటు వేయండి. లాలూ కుటుంబం పిల్లల అభివృద్ధి కోసం ఆర్జేడీకి ఓటు వేయండి. మీ కుటుంబం అభివృద్ధి కోసమైతే బీజీపీకి ఓటు వేయండి, అని ప్రధాని మోదీ తెలిపారు “ అనే శీర్షిక హిందీలో పెట్టారు. ఇందులో 1:30 టైమ్ స్టాంప్ దగ్గర మోదీ బీజీపీకి ఓటు వేయమని చెప్పడం మనం చూడవచ్చు.
ఈ సభ గురించి ఇండియా టుడే జూన్ 27 నాడు ఒక కథనం ప్రచురించింది. ఇందులో ఈ యూట్యూబ్ వీడియోలలో ఉన్న ఫొటోని జోడించింది. “MeraBoothSabseMajboot ప్రచారంలో భాగంగా భోపాల్ లో పార్టీ కార్యకర్తలని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ” అనే శీర్షిక ఈ ఫొటోకి పెట్టింది. “మీ కొడుకుల, కూతుళ్ళ, మనవల, మనవరాళ్ళ సంక్షేమం కోసం కుటుంబ పార్టీలకి కాకుండా బీజేపీకి ఓటు వేయండి” అని మోదీ అన్నారని ఈ కథనంలో ఉంది.
తీర్పు
‘కాంగ్రెస్ కి ఓటు వేయమని’ మోదీ చెబుతునట్టున్న వీడియో ఎడిటెడ్ వీడియో. ఒరిజినల్ వీడియోలో మోదీ మీ పిల్లల మంచి కోసం బీజేపీకి ఓటు వేయండి అని అన్నారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.
(అనువాదం - గుత్తా రోహిత్)