హోమ్ ఇస్కోన్ గుడి కి చెందిన 2016 నాటి ఫొటోని బంగ్లాదేశ్ హింసకు ముడి పెడుతూ షేర్ చేస్తున్నారు

ఇస్కోన్ గుడి కి చెందిన 2016 నాటి ఫొటోని బంగ్లాదేశ్ హింసకు ముడి పెడుతూ షేర్ చేస్తున్నారు

ద్వారా: వనితా గణేష్

ఆగస్టు 12 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఇస్కోన్ గుడి కి చెందిన 2016 నాటి ఫొటోని బంగ్లాదేశ్ హింసకు ముడి పెడుతూ షేర్ చేస్తున్నారు బంగ్లాదేశ్ లో ఇఫ్తార్ విందు సమయం లో అంటూ షేర్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

అబద్ధం

వైరల్ అవుతున్న ఫొటో 2016 కు చెందినది. పశ్చిమ బెంగాల్ లో ఇఫ్తార్ విందు సమయం లోనిది. బంగ్లాదేశ్ లోని హింస కు చెందినది కాదు.

క్లెయిమ్ ఏమిటి? 

సామాజిక మాధ్యమాలలో ఒక ఫొటో వైరల్ అవుతుంది, ఇందులో తెల్ల దుస్తులు ధరించిన ఒక వ్యక్తి,  టోపీ ధరించిన వ్యక్తులకు ఇఫ్తార్ విందు వడ్డిస్తున్నట్టుగా ఉంది. దీనిని షేర్ చేస్తూ, ఇది బంగ్లాదేశ్లోని ఇస్కాన్ గుడి అని, దీనికి నిప్పు పెట్టారు అని షేర్ చేస్తున్నారు. ఇఫ్తార్ అనేది, ముస్లిం మతస్థులు రమదాన్ మాసం లో ఉపవాసాన్ని ముగించుకునే సమయంలో చేసే విందు.

ఆ ఫొటోకి శీర్షికగా, “అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం కి చెందిన ఒక సన్యాసి, ముస్లింలకు ఇఫ్తార్ సమయం లో మిఠాయిలు పంచుతున్నారు” అని ఉంది.

ఒక ఫేస్బుక్ యూజర్ ఈ వీడియోని షేర్ చేస్తూ (ఆర్కైవ్ ఇక్కడ) ఇలా రాసుకొచ్చారు, “కొన్ని రోజుల క్రితం, బంగ్లాదేశ్ లో ఇస్కాన్ వారు ఈద్ రోజున వారి లౌకికత్వాన్ని రుజువు చేసుకోడానికి గుడిలో భోజనం పెట్టారు. ఇప్పుడేమో, ఆ తలపై టోపీ పెట్టుకున్న వారి దయతో ఇస్కాన్ గుడినే దహనం చేశారు.” మరిన్ని పోస్టుల ఆర్కైవ్ లింకులు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.


సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్లు (సౌజన్యం: ఫేస్బుక్/ ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

బంగ్లాదేశ్ లోని మెహెర్పూర్ లోని ఇస్కాన్ గుడి ని దహనం అయితే చేశారు. అయితే, ప్రస్తుతం వైరల్ అవుతున్న క్లెయిమ్ లో చూపించింది మాత్రం భారతదేశం లోని ఇస్కాన్ గుడి. బంగ్లాదేశ్ కి సంబంధం లేదు.

మేము ఏమి కనుగొన్నము?

వైరల్ అవుతున్న ఫొటో ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, UCANews జులై 4, 2016 నాడు “Hindu group hosts fast-breaking event for Muslims” అనే శీర్షిక తో పబ్లిష్ చేసిన ఒక కథనం లభించింది (ఆర్కైవ్ ఇక్కడ). ఈ కథనం లో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటో ఉంది. దీనికి వివరణగా ఇది మాయాపూర్ లో జూన్ 22 నాడు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం తరపున ఒక సన్యాసి ముస్లిం మతస్థులకు ఇఫ్తార్ విందుకు గాను మిఠాయిలు పంచుతున్నన్నారని తెలిపారు. ఈ ఫోటోని రఘు నాథ్ అనే వ్యక్తి తీశారు. అయితే, ఈ శీర్షికను తొలగించి, ఇప్పుడు అబద్ధపు క్లైమ్ తో ఈ ఫొటోని షేర్ చేస్తున్నారు.

ఈ కథనం ప్రకారం, ఇస్కాన్ 50 వ వార్షికోత్సవ సందర్బంగా ఈ విందు నిర్వహించినట్టు ఇస్కాన్ ప్రజా సంబంధాల అధికారి గౌరంగ్ దాస్ తెలిపారు.


ప్రస్తుత వైరల్ అవుతున్న ఫొటో 2016 లో పబ్లిష్ అయినప్పటి స్క్రీన్ షాట్ (సౌజన్యం: UCA News)

పైగా, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా మాకు భారతీయ న్యూస్ ఏజెన్సీ IANS షేర్ చేసిన (ఆర్కైవ్ ఇక్కడ) మరో పోస్టు కుడా లభించింది, ఇందులో ఈ ఫొటోకి శీర్షికగా, “(220616) Kolkata: ISKCON holds Iftar gathering.” ఉంది.

ఇలాంటి మరో ఫొటోని డెక్కన్ హెరాల్డ్ ఫేస్బుక్ పేజీ లో కుడా షేర్ చేశారు (ఆర్కైవ్ ఇక్కడ), ఇందులో అదే సన్యాసి ముస్లిం వ్యక్తులతో కలిసి భోజనం చేస్తుండటం చూడొచ్చు. దీనికి శీర్షికగా ఇది పశ్చిమ బెంగాల్ లోని నదియా జిల్లాలో మాయాపూర్ అనే ఊరిలోని ఇస్కాన్ గుడి లో ముస్లిం మతస్థులు ఇఫ్తార్ విందు చేసినట్టుగా రాసి. ఇది పిటిఐ వారు తీసిన ఫొటోగా తెలిపారు.

ఇస్కాన్ ఇండియా డైరెక్టర్ యుధిష్ఠిరః గోవింద దాస్ ను మేము సంప్రదించాము, ఆయన మాతో ఈ ఫోటోని పశ్చిమ బెంగాల్ లోని మాయాపూర్ లోనే తీశారు అని తెలిపారు.

ఒక వివాదాస్పద ఉద్యోగ రిజర్వేషన్ విధానానికి సంబంధించి జూన్ నెల చివర్లో షేక్ హాసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్ధి ఉద్యమం మొదలయ్యింది. ఈ విధానం ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం 1971 లో విముక్తి ఉద్యమంలో పాల్గొన్న కుటుంబసభ్యులకి కేటాయిస్తారు. ఈ విధానాన్ని 2018 లో రద్దు చేశారు. అయితే, ఒక కోర్టు దీనిని జూన్ 2024 లో పునరుద్ధరించింది.

నిరసనలకి జవాబుగా బంగ్లాదేశ్ లో ఇంటర్నెట్ సదుపాయాలని తొలగించారు. పోలీస్ కర్ఫ్యూ పెట్టారు. అయితే, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఇందులో కొంతమంది నిరసనకారులు చనిపోయారు.

ఈ నిరసనల తరువాత, బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు ఈ విధానాన్ని పాక్షికంగా కొట్టివేసింది. ప్రభుత్వ ఉద్యోగాలలో 93 శాతం మెరిట్ ఆధారంగానే నియమించాలి అని తీర్పునిచ్చింది. అయితే, నిరసనలు కొనసాగాయి. షేక్ హసీనా కి వ్యతిరేకంగా, పాలక పార్టీ అవామీ లీగ్ కి వ్యతిరేకంగా కొనసాగాయి. ఒక కథనం ప్రకారం, దాదాపుగా చనిపోయినవారి సంఖ్య 300.

ఆగస్ట్ 5 నాడు షేక్ హసీనా రాజీనామా చేసి, దేశం వదిలి వెళ్లిపోయారు. ఆ తరువాత తన ఇంటి మీద దాడి చేసిన, తన తండ్రి బంగ్లాదేశ్ విముక్తి నాయకుడు షేక్ ముజీబుర్ రెహ్మాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఫొటోలు వచ్చాయి. షేక్ హసీనా ప్రస్తుతం భారత దేశంలోఉన్నారు. బ్రిటన్ కి వెళ్ళే అవకాశం ఉందని అంచనా.

ఈ నేపధ్యంలో నోబెల్ పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ సైన్యం ఏర్పాటు చేసింది . ఆయన ఆగష్టు 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు.

ఇండియా టుడే కథనం ప్రకారం, బంగ్లాదేశ్ లోని ఖుల్నా లోని ఇస్కాన్ గుడికి ఆగష్టు 5, 2024 నాడు నిప్పు పెట్టారు. మరో నాలుగు దేవాలయాలని మరియు ఢాకా లోని భారతీయ సాంస్కృతిక సెంటర్ ని కుడా టార్గెట్ చేసినట్టుగా ఈ కథనంలో ఉంది.

తీర్పు

వైరల్ అవుతున్న ఫొటో 2016 కు చెందినది, పశ్చిమ బెంగాల్ లో ఇఫ్తార్ విందు సమయం లోనిది. ఇది బంగ్లాదేశ్ లోని హింస కు చెందినది అన్నట్టుగా తప్పుగా షేర్ చేస్తున్నారు.

లాజికల్లీ ఫ్యాక్ట్స్ బంగ్లాదేశ్ కి సంబంధించిన సమాచారాన్ని తరుచూ నిజ నిర్ధారణ చేస్తున్నది. వాటికి సంబంధించిన కథనాలను ఇక్కడ చదవండి. 

(అనువాదం: రాజేశ్వరి పరసా)


0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.