హోమ్ పాలస్తీనాలో పిల్లలని చంపినట్టుగా సిరియాకి సంబంధించిన పాత ఫోటో షేర్ చేస్తున్నారు

పాలస్తీనాలో పిల్లలని చంపినట్టుగా సిరియాకి సంబంధించిన పాత ఫోటో షేర్ చేస్తున్నారు

ద్వారా: ఇషిత గోయల్ జె

అక్టోబర్ 17 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
పాలస్తీనాలో పిల్లలని చంపినట్టుగా సిరియాకి సంబంధించిన పాత ఫోటో షేర్ చేస్తున్నారు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్షాట్ (ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వైరల్ అవుతున్న ఫొటో 2013లో సిరియాలో జరిగిన రసాయనిక దాడికి సంబంధించినది.

పాఠకులకి గమనిక: ఈ కథనంలో ఆందోళన కలిగించే సంఘటనలు గురించి వర్ణన ఉంటుంది. 

క్లెయిమ్ ఏమిటి?

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపధ్యంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గాజా వైద్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన అధికారిక ప్రకటన ప్రకారం, ఇజ్రాయెల్ దాడిలో ప్రాణాలు కోల్పోయినవారిలో మొత్తం 724 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఈ నేపధ్యంలో సామాజిక మాధ్యమాలలో పిల్లల శవాలు ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతున్నది. ఇజ్రాయెల్-హమాస్ యుద్దంలో పాలస్తీనా పిల్లలు బలి అయ్యారు అంటూ షేర్ చేస్తున్నారు. “ నా హృదయం చాలా బరువెక్కింది.అల్లా పాలస్తీనా ప్రజలను కాపాడు గాక మరియు అమరులకు అత్యధిక జన్నా(స్వర్గ ప్రాప్తి) లభించాలి,” అని రాస్తూ ఒక ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) యూజర్ పోస్ట్ చేశారు, మరొక ఎక్స్ యూజర్, “పాలస్తీనాలో చిన్నారుల మారణహోమం,” అని షేర్ చేశారు. ఈ పోస్ట్ ల ఆర్కైవ్ లింకులు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

వాస్తవం ఏమిటి?

రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా మేము ఈ ఫోటోని వెతికితే  స్టాక్ ఫోటోల వెబ్సైట్ అయిన అలమీ మరియు గెట్టీలో 2013లోనే ఈ ఫొటో అప్లోడ్ చేశారని తెలుసుకున్నాము. గెట్టీ ఫోటోల సైటులో ఈ ఫోటో “సిరియాలో ‘రసాయనిక ఆయుధాల దాడి’” అనే పేరుతో ఉంది. “ఆగస్టు 21, 2013నాడు డమస్కస్ లోని ఘౌటాలో రసాయనిక ఆయుధాల దాడిగా అనుమానిస్తున్న ఘటనలో చనిపోయిన చిన్న పిల్లల శవాలు,” అనేది ఈ ఫొటో శీర్షిక. 

అలమీ ఈ చిత్రానికి శీర్షికగా “సిరియన్ రెబెల్స్ ప్రకారం డమస్కస్ లోని తూర్పు ఘౌటాలో ప్రభుత్వ మద్దతుదారులు చేసిన దాడి లో చనిపోయిన పిల్లల శవాలు నేల మీద పరిచి ఉన్నాయి,”అని పెట్టింది.  ఈ ఘటన డమస్కస్ లో ఆగస్టు 21, 2013నాడు జరిగింది. కానీ సిరియన్ ప్రభుత్వం మాత్రం రసాయనిక ఆయుధాలు వాడినట్టుగా వచ్చిన ఆరోపణను ఖండించింది. 

గెట్టీ ఫొటో స్క్రీన్ షాట్ (సౌజన్యం: గెట్టీ ఇమేజస్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

“సిరియా రసాయనిక ఆయుధాలను ఏ విధంగా వదిలించుకోవచ్చు” అనే శీర్షికతో సెప్టెంబర్ 14, 2021 నాడునేషనల్ జీయోగ్రఫిక్ లోప్రచురితమయిన ఒక కథనంలో కూడా ఈ ఫొటో ఉంది.. ఆ ఫొటోకి శీర్షికగా, “ విషపూరితమయిన రసాయనిక ఆయుధాల దాడి తరువాత ఆగస్టు 21నాడు చిన్న పిల్లల శవాలు సిరియాలోని డమస్కస్  బయట ఉన్నాయి.

ఆగస్టు 2013 లో ఏం జరిగింది?

సిరియా రాజధాని అయిన డమస్కస్ లో ఘౌటా అనే ప్రాంతంలో ఆగస్టు 21, 2013 నాడు ఒక భయంకరమైన రసాయనిక ఆయుధాల దాడి జరిగింది. సిరియాలో అంతరుధ్యం (సిరియా అధ్యక్షుడు బషీర్ అల్ అసద్ సేనలకి విపక్ష సేనలకి మధ్య చోటుచేసుకున్న యుద్ధం ఇది) మొదలయిన రెండు సంవత్సరాల తరువాత ఈ ఘటన చోటుచేసుకుంది. 

జర్మన్ వార్తా సంస్థ డిడబల్యూ వారు ఉటంకించిన ఐక్యరాజ సమితి  మిషన్ వారి నివేదిక ప్రకారం సరిన్ అనే ఒక హానికరం అయిన పదార్థాన్ని ఆ దాడి లో ఉపయోగించినట్టు తమ విచారణలో తేలిందని వారు పేర్కొన్నారు. ఆయుధ నిపుణుల ప్రకారం దాడిలో ఉపయోగించిన  రాకెట్లు సిరియన్ సైన్యానికి సంబంధించినవని ఏపి వార్తా సంస్థ ఒక కథనం ప్రచురించింది. ఈ దాడికి అసద్ కారణం అని చాలా మంది భావించగా, సిరియా ప్రభుత్వం మాత్రం తమకి ఈ దాడితో సంబంధం లేదని, 2013 ఒప్పందం ప్రకారం తాము రసాయనిక ఆయుధాలని వదిలివేశామని తెలిపినట్టు ఏపి తన కథనంలో పేర్కొంది.

తీర్పు

వార్తా కథనాలు ప్రకారం వైరల్ అవుతున్న ఫొటో ఆగస్టు 2013 లో సిరియాలో చోటు చేసుకున్న ఘటనకి సంబంధించినది. ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్ మరియు హమాస్ యుద్ధానికి సంబంధించినది కాదు. కనుక మేము దీనిని అబద్దం అని నిర్ధారించాము. 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.