ద్వారా: నబీలా ఖాన్
మార్చి 12 2024
ఇలా ఇంటి వద్ద లభించే పదార్థాలతో చేసి మిశ్రమం సహజంగానే యాంటిబయోటిక్స్ లాగా పనిచేస్తుంది అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
క్లెయిమ్ ఏమిటి ?
తేనె, అల్లం మరియు వెల్లుల్లి కలిపిన మిశ్రమం సహజంగానే యాంటిబయోటిక్స్ లాగా పనిచేస్తుంది అంటూ ఫేస్బుక్ లో ఒక రీల్ వైరల్ అవుతుంది. ఈ కథనం రాసే సమయానికి ఈ పోస్ట్ కి 26,000 లైక్స్ మరియు 8,200 షేర్స్ ఉన్నాయి. ఇలా కలిపిన మిశ్రమాన్ని రోజు పొద్దున్న ఒక చెంచాడు తాగితే తమని తాము రోగాల బారి నుండి కాపాడుకోవచ్చు అని ఉంది.
వెల్లుల్లిలో యాంటీ-బ్యాక్టరియల్, అల్లంలో యాంటీ-ఇన్ఫ్లమాటోరీ మరియు నిమ్మలో విటమిన్ సి ఉండటం వలన ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అని ఈ వీడియోలో ఉంది.
వాస్తవం ఏమిటి?
ఈ క్లైమ్ అర్ధం కావాలంటే ముందుగా మనం యాంటీ బయోటిక్స్ అంటే ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకుందాం. యుకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్ ( ఎన్ హెచ్ ఎస్) ప్రకారం, యాంటీ బయోటిక్స్ అనేవి ఏదైనా బాక్టీరియా వల్ల కలిగే సంక్రమణను అరికట్టడానికి వాడతారు, కానీ ఇవి అన్నింటికీ పని చేయవు. అత్యవసర పరిస్థితులలో మాత్రమే ఇవి ఇస్తారు. శాస్త్రీయ పరిశోధనను ప్రోత్సహించే వెల్కం అనే సంస్థ ప్రకారం, ఒక యాంటీబయోటిక్ తయారుచేయడానికి దాదాపుగా 10-15 సంవత్సరాలు పడుతుంది, పైగా కొన్ని కోట్లు ఖర్చువుతుంది.
వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండటం నిజమే కావొచ్చు, కానీ దీనిని నిర్ధారించడానికి మరి కొన్ని శాస్త్రీయ పరీక్షలు జరుగుతున్నాయి, ఒక రోగాన్ని నిరోధించగలదా లేదా అనే దానిని నిర్దారించడానికి ఇంకా కాస్త మెరుగైన పరీక్షలు జరగాల్సి ఉంది.
అలాగే అల్లంలో కుడా ఆంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి ఆరోగ్యానికి మంచిదే, కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే, బ్లడ్ తిన్నెర్స్ వాడే వారికి అధిక రక్త స్రావం జరిగే అవకాశాలు ఉన్నాయి. నిమ్మ పండ్లలో కుడా విటమిన్ సి ఉంటుంది, ఇది ఐరన్ కు మంచిదే కానీ వీటిని నిర్ధారించడానికి ఇంకాస్త పరిశోధన కావాలి.
హోమీ బాబా సెంటర్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ లో పని చేసే శాస్త్రీయ అధికారి, విక్రాంత్ ఘనేకర్ లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ, “భారతీయ వంటకాలలో వాడే అనేక పదార్థాలలో యాంటీ బ్యాక్టరియాల్ మరియు యాంటీ ఇన్ఫ్లుమాటోరీ లక్షణాలు ఉంటాయి. పసుపులో ఉండే కుర్క్యుమిన్, అల్లంలో ఉండే జింజిరోల్స్ మరియు వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ కొన్ని ఉదాహరణలు, వీటిపై పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ప్రత్యేకంగా ఈ మిశ్రమాన్ని కలిపితే యాంటీబయోటిక్ లాగా పనిచేస్తుంది అనటానికి ఎటువంటి ఆధారాలు లేవు. దేనినైనా ఔషధం లాగా వాడాలంటే, వాటి మీద అనేక కట్టుదిట్టమయిన నాణ్యతా పరీక్షలు, క్లినికల్ ట్రైల్స్ జరగాలి.”
2018 లో ఔషధ మొక్కలపై ప్రచురితమయిన పరిశోధన ప్రకారం, “ఎవరికీ వారే నిపుణుల పర్యవేక్షణ లేకుండా ఔషధ మొక్కలను తీసుకుంటే, దాని వలన జరిగే పరిణామాలు తీవ్రస్థాయిలో ఉండవచ్చు,” అని ఉంది.
ఘనేకర్ మాట్లాడుతూ, “ ఇలా ఇంట్లో చేసుకునే మిశ్రమాలకు ఎటువంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఒక ప్రత్యేక ఫార్ములా కానీ మోతాదులు కానీ నిర్ధారించలేదు. ఏ విధమయిన రసాయనాలు ఇందులో కలుస్తున్నాయి అనే దానిపైన కుడా అవగాహన లేదు. ఎక్కువగా తీసుకుంటే ఒక్కోసారి ఎలర్జీ వచ్చే అవకాశాలు కుడా ఉన్నాయి. కునుక ఇలాంటివి నమ్మదగిన శాస్త్రీయ పద్ధతులు కావు, వీటి ప్రతిఫలాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి,” అని తెలిపారు.
తీర్పు :
ఇంటి వద్ద లభించే పదార్థాలతో చేసి మిశ్రమం సహజంగానే యాంటిబయోటిక్స్ లాగా పనిచేస్తుంది మరియు రోగాలను అరికడుతుంది అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటికి ఔషధ గుణాలు ఉన్నప్పటికీ ఇవి యాంటీ బయోటీక్స్ ని కానీ శాస్త్రీయ ఔషధాన్ని కానీ భర్తీ చేయలేవు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.
(అనువాదం : రాజేశ్వరి పరస)
Read this story in English here.